హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కారు రేస్ కేసు వేడిపుట్టిస్తోంది. మాజీ మంత్రి కేటీఆర్ నందినగర్‌లోని నివాసం నుంచి జూబ్లిహిల్స్‌లోని ఏసీబీ ఆఫీసుకు చేరుకున్నారు. ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఆయన విచారణకు హాజరవుతున్నారు. కేటీఆర్‌తో పాటు ఏసీబీ ఆఫీసుకు లాయర్ రామచంద్రరావు కూడా వెళ్లారు. సీసీటీవీ పర్యవేక్షణలో కేటీఆర్ విచారణ జరగబోతుంది. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో ఏసీబీ ఆఫీసు దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ ఆఫీసుకు వెళ్లే దారులన్నీ మూసివేశారు.
ముగ్గురు అధికారుల సమక్షంలో కేటీఆర్‌ను ప్రశ్నించబోతున్నారు. ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితిరాజు, ఏఎస్‌పీ నరేందర్, డీఎస్పీ ప్రశ్నించనున్నారు. మొత్తం విచారణను ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి పర్యవేక్షించనున్నారు. ఇక కేటీఆర్ విచారణకు స్పెషల్ రూమ్స్ ఏర్పాటు చేశారు.
అసలు కేసు ఏంటి?
బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2023 ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో అంతర్జాతీయ స్థాయి ఫార్ములా ఈ కారు రేసును నిర్వహించారు. ఈ రేసుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను మాజీ మంత్రి కేటీఆర్ చూసుకున్నారు. గతేడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ చుట్టూ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2.8 కిలోమీటర్ల ట్రాక్‌లో మొదటి ఫార్ములా ఈ- కార్ల పోటీ జరిగింది. తొమ్మిదో సీజన్ ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు 200 కోట్లు ఖర్చయింది. ఇందులో ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో 150కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ 30 కోట్లు ఖర్చుచేశాయి. రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్‌ఎండీఏ 20 కోట్లు ఖర్చు చేసింది. ఇది విజయవంతం కావడంతో ఈ ఏడాది ఫిబ్రవరి 10న మరోసారి నిర్వహించేందుకు ఫార్ములా ఈ ఆపరేషన్‌తో ఎంఏయూడీ 2023 అక్టోబరులో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకు హెచ్‌ఎండీఏ 55 కోట్లు ఎఫ్‌ఈవోకు చెల్లించింది.
ఈవెంట్‌కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా ఉండి.. ఖర్చంతా ప్రైవేటు సంస్థలైన గ్రీన్కో, ఫార్ములా ఈ నే భరించాల్సి ఉంది. కానీ.. గత సీజన్‌లో ప్రధాన భాగస్వామిగా ఉన్న గ్రీన్కో సంస్థను తొలగించి ఆ స్థానంలో రాష్ట్ర ప్రభుత్వం ఉండేలా సీనియర్ ఐఏఎస్ ఒకరు సొంత నిర్ణయం తీసుకున్నారన్న ఆరోపణలున్నాయి. అప్పట్లో తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఆ పరిస్థితుల్లోనే ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా, ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, కనీసం ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లకుండానే ఆ ఉన్నతాధికారి ఈవెంట్ నిర్వహణకు హెచ్‌ఎండీఏ నుంచి 55 కోట్లు ముందస్తు చెల్లింపులు చేశారన్న ప్రచారం సాగింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే.. ఒప్పందంలో పేర్కొన్న అంశాలను పాటించకపోవడంతో తాము హైదరాబాద్ రేస్ నుంచి తప్పుకొంటున్నట్లు డిసెంబర్ నెలలో ఎఫ్‌ఈవో ప్రకటించింది. అనంతరం పదో సెషన్ రేసు రద్దయింది. ఫిబ్రవరి 10న ఈవెంట్ జరిగి ఉంటే హెచ్‌ఎండీఏపై 200 కోట్ల భారం పడేది. కానీ, ఇంతలో విషయం బయటపడడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.