హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు కల్పించాలంటే జీహెచ్‌ఎంసీ ఖజానాలో వందల కోట్ల రూపాయలు ఉండాలి. అందుకే ఖజానాను నింపుకునేందుకు ట్యాక్స్ వసూళ్లపై ఫోకస్ పెంచింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. మొండి బకాయిల వసూళ్లే లక్ష్యంగా ముందుకెళ్తోంది. నోటీసులు ఇచ్చినా స్పందించకపోతే.. ఆస్తులను సీజ్ చేస్తోంది. రూ.5500 కోట్లకు పైగా పెండింగ్ ట్యాక్స్ వసూలు చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు వేసింది.
పన్ను బకాయిలు చెల్లించని తాజ్ బంజారా హోటల్‌కి షాకిచ్చింది. పలు మార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో హోటల్‌ను సీజ్ చేసింది. మొత్తం కోటి 43 లక్షలు కట్టాలని ఇప్పటికే పలు మార్లు తాజ్ బంజారాకు నోటీసులు జారీ చేసింది. అయినా స్పందించకపోవడంతో హోటల్‌కు తాళాలు వేసి సీజ్ చేసింది. దీంతో దిగొచ్చిన తాజ్ హోటల్ యాజమాన్యం.. రూ.కోటి 43 లక్షలకు గాను రూ.51 లక్షలను చెల్లించింది.
రూ.5500 కోట్లకు పైగా పెండింగ్ ట్యాక్స్ వసూలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న జీహెచ్‌ఎంసీ..మొత్తం ఆరు లక్షల 34 వేల మందికి నోటీసులు ఇచ్చింది. ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో 62 ఆస్తులను సీజ్ చేసింది. దీంతో ఆయా ఆస్తుల యాజమానుల నుంచి రెండు కోట్ల 11 లక్షల రూపాయలు వసూళ్లయ్యాయి.
మొండి బకాయిలను వసూలు చేయడమే లక్ష్యంగా ప్రత్యేక ఫోకస్ చేశారు జీహెచ్‌ఎంసీ అధికారులు. ప్రతి సర్కిల్లో టాప్ 100 డీ ఫాల్టర్లపై శ్రద్ధ పెట్టాలని కమిషనర్ ఇలంబర్తి ఆదేశించారు. గత ఏడాది మొత్తం 1960 కోట్ల రూపాయల టాక్స్ వసూలు చేసిన జీహెచ్‌ఎంసీ….ఈ ఏడాది 2000 కోట్ల వరకు టాక్స్ వసూలు చేయాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇందులో ఇప్పటివరకు కేవలం రూ. 1484 కోట్లు వసూలు చేశారు. టార్గెట్ లక్ష్యం భారీగా ఉండడంతో టాక్స్ అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం అధికారులు.