బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆమె భారత్‌కు వచ్చారు. షేక్ హసీనాను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇక్కడి నుంచి యూకేలోని తన సోదరి దగ్గరికి వెళ్లాలని నిర్ణయించినా.. ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. యూకే రాజకీయ ఆశ్రయం కోసం హసీనా అభ్యర్థనను తిరస్కరించింది. హసీనాకు భారత్ తాత్కాలికంగా మాత్రమే ఆశ్రయం కల్పించింది. పలు దేశాలు ఆమెకు వీసా నిరాకరించడంతో ఎక్కడకు వెళ్లాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారామె.
షేక్ హసీనా విదేశాల శరణు కోరుతున్నారు. తాత్కాలిక ఆశ్రయం కల్పించలేమని బ్రిటన్ తేల్చి చెప్పింది. ఆశ్రయం కోరుతూ లేదా శరణార్థిగా వచ్చేందుకు తమదేశం వలసచట్టాలు అంగీకరించవని యూకే చెబుతోంది. ఒకవేళ బ్రిటన్‌కు వెళ్లినా తనను మళ్లీ బంగ్లాదేశ్‌కు అప్పజెబుతారేమోనని షేక్ హసీనా ఆందోళన చెందుతున్నారు. మరోవైపు అమెరికా ప్రభుత్వం కూడా షేక్ హసీనా వీసాను రద్దు చేసింది. యూరోప్‌లో ఆశ్రయం పొందే అంశాలపై షేక్ హసీనా పరిశీలిస్తున్నారు. అప్పటివరకు ఆమె భారత్ లోనే ఉండనున్నారు.
మరోవైపు భారత్- బంగ్లాదేశ్ సరిహద్దుల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. సరిహద్దుల్లో అదనపు బలగాలను మోహరించింది భారత్. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం నేపథ్యంలో రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. మరోవైపు రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. సైనిక పాలకుల చేతుల్లోకి వెళ్లింది. ఆ దేశ వ్యాప్తంగా హింసాత్మక ఘటనలు కొనసాగుతున్నాయి. ఢాకా సహా అనేక నగరాల్లో జరిగిన విధ్వంసంలో ఇప్పటి వరకు 440 మందికి పైగా మృతి చెందారు.
బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా నోబెల్ శాంతి గ్రహీత యూనస్ పగ్గాలు చేపట్టనున్నారు. బంగ్లాదేశ్ అధ్యక్షుడు మొహమ్మద్ షహబుద్దీన్ పార్లమెంటును రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలన యంత్రాంగం ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్‌ను సారథిగా నియమిస్తున్నట్లు అర్ధరాత్రి సమయంలో ప్రకటించారు. తన దేశం, ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. హసీనా వైదొలగడంతో దేశానికి రెండోసారి విముక్తి లభించిందని వ్యాఖ్యానించారు.