అమెరికా అధ్యక్ష పీఠం ఎక్కాడో లేదో డొనాల్డ్ ట్రంప్ ఆర్డినెన్స్‌లపై చకచకా సంతకాలు చేసేశాడు. తన విపరీతమైన చర్యలతో విదేశీయులను పరుగులు పెట్టిస్తున్నాడు. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. అవసరం లేకపోయినా సిజేరియన్ చేసి వెంటనే బిడ్డను బయటకు తీయాలని డాక్టర్లను ప్రాధేయపడుతున్నారు. ఇది ఇద్దరికీ ప్రమాదం అని తెలిసినా తమ బిడ్డకు అమెరికా పౌరసత్వం కోసం వేరే మార్గం లేక డాక్టర్లను బతిమాలుకుంటున్నారట.
ఎందుకు ఇలా చేస్తున్నారంటే..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించి జనవరి 20న అగ్రరాజ్యం 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించాడు. పీఠాన్ని అధిరోహించిన తొలి రోజే జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం ఇటీవలి వరకూ ఉండేది. ట్రంప్ అధికారం చేపట్టగానే వలసలు వచ్చి ఉంటున్న వారికి బిడ్డలు పుడితే.. తమ దేశ పౌరసత్వం ఇవ్వలేమంటూ రద్దు చేశారు. దీంతో అమెరికాలో ఉంటున్న విదేశీయులు తెగ ఆందోళన చెందుతున్నారు.
గర్భం దాల్చిన విదేశీ మహిళలు ఏం చేయాలో తెలియక నరకయాతన పడుతున్నారు. ట్రంప్ తాజా ఉత్తర్వులు అమల్లోకి వచ్చే లోపల ఎలాగైనా డెలివరీ చేయించుకోవాలని ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. ముఖ్యంగా ఫిబ్రవరి 20వ తేదీ లోపల డెలివరీలు చేయాలని వైద్యులను కోరుతున్నారట. ఇందుకు డాక్టర్లు ససేమిరా అంటున్నారట. 8,9 నెలలు నిండితే సిజేరియన్ చేసినా ప్రమాదం లేదు కానీ.. 6, 7 నెలల వారికి ఆపరేషన్ చేయడం ప్రమాదకరమని అక్కడి వైద్యులు వారికి నచ్చజెబుతున్నారట.
కానీ కొందరు విదేశీ మహిళలు సిజేరియన్ చేయమని వైద్యులను ప్రాధేయపడుతున్నారు. తమ బిడ్డకు అమెరికా పౌరసత్వం కావాలంటే కొంచెం రిస్క్ అయినా ఫర్వాలేదు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీయమని కోరుతున్నారట. ఇలాంటి వారికి డాక్టర్లు కౌన్సెలింగ్ ఇచ్చి పంపిస్తున్నారట. నెలలు నిండక ముందే డెలివరీ అయితే పుట్టే పిల్లల్లో అనేక రకాల సమస్యలు వస్తాయని.. ఇది బిడ్డకు ఏ మాత్రం మంచిది కాదని వారికి నచ్చజెప్పి పంపిస్తున్నారు అక్కడి వైద్యులు.
అయితే ఆనందించాల్సిన విషయం ఏంటంటే.. డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు సియాటెల్‌లోని ఫెడరల్ కోర్టు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. దీనిపై డెమోక్రాట్లు అధికారంలో ఉన్న 22 రాష్ట్రాలు 5 దావాలను వేశాయి. అందులో ఒక దానిలో ఫెడరల్ జడ్జి .. ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేశారు. 14 రోజులపాటు అధ్యక్షుడి ఆదేశాన్ని నిలిపివేస్తున్నానని ప్రకటించారు. కోర్టు తీర్పుతో ప్రస్తుతానికి అమెరికాలోని విదేశీయులు ఊపిరిపీల్చుకుంటున్నారు.