ఏపీ ఫైబర్‌నెట్ లిమిటెడ్ ఎండీ దినేష్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేయడం, తదనంతర పరిణామాల నేపథ్యంలో ఆ సంస్థ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేశారు. జీవీ రెడ్డి ఛైర్మన్ పదవికి రాజీనామా చేయగా దాన్ని సీఎం ఆమోదించారు. ఆ వెంటనే ఎండీ దినేష్‌కుమార్‌కూ స్థానచలనం కల్పించారు.
ఏపీ ఫైబర్‌నెట్ ఎండీ దినేష్‌కుమార్, కొందరు అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని జీవీ రెడ్డి ఆరోపించారు. ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కై సంస్థ ఆర్థికమూలాలు దెబ్బతీస్తున్నారని అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఛైర్మన్‌గా తాను సంస్కరణలు తీసుకొచ్చినా ఆదాయం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఫైబర్ నెట్‌లో ఉద్యోగుల తొలగింపు, జీఎస్టీ చెల్లింపుల వంటి అంశాలపైనా జీవీ రెడ్డి ఆరోపణలు చేశారు. వైసీపీకి సానుభూతిపరులు అయిన ఉద్యోగులను జీవీ రెడ్డి తొలగించినప్పటికీ ఫైబర్ నెట్ ఎండీ ఆమోదం తెలపలేదని ఆగ్రహంగా వ్యక్తం చేశారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్దకు వెళ్లి జీవీ రెడ్డి వివరణ ఇచ్చారు. బహిరంగ ఆరోపణలు చేయడమేంటని జీవీరెడ్డిపై మండిపడ్డారు. ఇకపై గీత దాటితే వేటు తప్పదని హెచ్చరించారు. ఆ వ్యవహారంలో దినేష్‌కుమార్ తప్పిదమూ ఉందని తేలడంతో ఆయననూ మందలించారు. అధికారులతో కలిసి పని చేసుకోవాలని సీఎం ఆదేశించారు. ఆరోపణలు చేసిన అధికారులతో కలిసి పని చేయడం ఇష్టం లేకపోవడంతోనే రాజీనామా చేశానని జీవీ రెడ్డి తెలిపారు.