అటవీసరిహద్దు జిల్లాల్లో ఏనుగుల గుంపులు బీభత్సం సృష్టించడం ఆందోళన కలిగిస్తోంది. అటవీప్రాంతాన్ని వదిలి గ్రామాల్లోకి రావడం ఆయా గ్రామాల ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. మనుషుల మీద దాడులు చేస్తూ ప్రాణాలు తీస్తున్నాయి. పంట పొలాలు, ఇళ్లను ధ్వంసం చేస్తున్నాయి. ఏనుగుల బెడద నుంచి తమను రక్షించాలని ఆయా గ్రామాల ప్రజలు అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు.
తాజాగా అన్నమయ్య జిల్లా గుండాలకోనలో ఏనుగుల గుంపు బీభత్సం సృష్టించింది. ఏనుగుల గుంపు దాడిలో ఏకంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మహా శివరాత్రి పురస్కరించుకుని అడవి మార్గం గుండా గుండాలకోనకు భక్తులు నడుచుకుంటూ వెళ్లే సమయంలో ఏనుగులు దాడి చేశాయి. వైకోట నుంచి గుండాలకోనకు వెళ్లే దారిలో జమాయాలగడ్డ సమీపంలో ఘటన చోటుచేసుకుంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఏనుగుల గుంపు హల్‌చల్ చేశాయి. జియ్యమ్మవలస మండల పెదమేరంగిలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. తెల్లవారుజామున సాయి గాయత్రి మోడరన్ రైస్ మిల్ షట్టర్లను విరగగొట్టి అందులోకి చొరబడ్డాయి. మిల్లులో భద్రపరిచిన ధాన్యం, బియ్యం నిల్వలను చల్లాచదురు చేశాయి. అయితే నెల రోజల వ్యవధిలో ఇదే మిల్లుపై రెండు సార్లు దాడి చేయడంతో యజమాని లబోదిమోమంటున్నాడు. సుమారు రూ.2 లక్షల వరకు ఆస్తినష్టం వాటిల్లిందని వాపోతున్నాడు.
గత నెలలోనూ పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. కొమరాడ మండలం పాలెం గ్రామంలో తోటలను నాశనం చేశాయి. చదలవాడ సత్యనారాయణ అనే రైతు 10 ఎకరాల పామాయిల్ తోటలో 70 మొక్కలను ఏనుగులు పీకేశాయి. తర్వాత పక్కనే ఉన్న కర్బూజ, బొప్పాయి తోటను సైతం నాశనం చేశాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.