స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI)అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తున్న రెజ్లర్లకు రైతులు మద్దతు తెలిపారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దీక్షాస్థలికి చేరుకున్న సంయుక్త కిసాన్ మోర్చా నేత రాకేశ్ టికాయత్ రెజర్లకు సంఘీభావం ప్రకటించారు. భారీగా ఢిల్లీ తరలివస్తామని రైతులు ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. జంతర్ మంతర్, ఢిల్లీ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే పెద్ద సంఖ్యలో రైతులు వాహనాల్లో ఢిల్లీకి తరలివస్తున్నారు. దీంతో ఢిల్లీ-యూపీ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
మరోవైపు రెజ్లర్లకు మద్దతుగా ఈనెల 11 నుంచి 18 దాకా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. అన్ని రాష్ట్రాల రాజధానులు, జిల్లా, తాలూకా కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపడతామని వెల్లడించింది. బ్రిజ్ భూషణ్ అరెస్టు అయ్యే దాకా రెజ్లర్లకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేసింది.