ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు గడచినా విభజన హామీలు నేటికీ అమలుకు నోచుకోలేకపో యాయి. పాలకు ల నిర్లక్ష్యం కారణంగా విభజన చట్టంలోని హామీల అమలు, నిర్మాణ పనులు తీవ్ర జాప్యానికి దారి తీస్తున్నాయి. కర్నూలులో 120 కోట్ల రూపాయలతో చేపట్టిన స్టేట్ క్యాన్సర్ ఆస్పత్రిలో కేవలం ఓపీ సేవలు మినహా పూర్తిస్థాయిలో అవసరమైయిన యంత్ర పరికరాలు అందుబాటులో లేవు. దీనిపై స్వతంత్ర్య న్యూస్ ప్రత్యేక కథనం.
ఉమ్మడి ఏపీ విభజన జరిగి పదేళ్లు పూర్తైంది. అయినా విభజన హామీలు నేటికీ అమలుకు నోచుకోలే కపోయాయి. పాల కుల నిర్లక్ష్యం కారణంగా విభజన చట్టంలోని హామీల అమలు, నిర్మాణ పనులు తీవ్ర జాప్యానికి దారి తీస్తున్నాయి. విభజన సమయంలో ఏపీకి కేంద్ర ప్రభుత్వ విభాగాలతోపాటు, ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిమ్స్, క్యాన్సర్ ఆస్పత్రులను మంజూరు చేశారు. కొన్నింటిని కేంద్రం, మరికొన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో చేపట్టాలి. రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఉమ్మడి కర్నూలు జిల్లాకు అప్పట్లో 120 కోట్ల రూపాయల వ్యయంతో స్టేట్ క్యాన్సర్ సెంటర్‌ను మంజూరు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని విభజన చట్టంలో చెప్పారు. కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో చేపట్టారు. 2019 జనవరి 8న అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు చేతుల మీదుగా క్యాన్సర్ సెంటర్ భవన నిర్మాణాన్ని ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీకి పనులను కట్టబెట్టారు. ఈనేపథ్యంలోనే వారు క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణాలను రెండు గా విడగొట్టారు. సివిల్ పనులకు 36 కోట్లు రూపాయలు, యంత్ర సామగ్రి, ఇతర పరికరాల కోసం 54 కోట్లు రూపాయలు అప్పట్లో వెచ్చించారు. ఒప్పదం ప్రకారం క్యాన్సర్ ఆస్పత్రి భవన నిర్మాణాలను 15 నెలలో పూర్తి చేసి అప్పగించాలి. ఈ నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతలను ఏపీ MSIDC ఆంధ్రప్రదేశ్ వైద్య, మౌళిక సదుపాయాల సంస్థల అధికారులకు అప్పగించారు.
కర్ణుడు చావుకు వంద కారణాలు అన్నట్లు క్యాన్సర్ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు వివిధ కారణాలతో గత ఎన్నికల ముందు ముగిసాయి. 2019లో ప్రారంభించినా పనులకు అడుగడుగునా ఆటంకాలు ఎదురైయ్యాయి. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావటం, కరోనా పరిస్థితుల వల్ల ఇబ్బం దులు ఎదుర్కోవడం, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణం లో ఉన్న పనులు 25 శాతంలోపు జరిగి ఉంటే ఆ పనులను కొత్త వైసీపీ ప్రభుత్వం నిలిపి వేయడం జరిగింది. ఆ తర్వాత క్యాన్సర్ ఆస్పత్రి వాస్తవ పరిస్థితిని వివరించి మళ్లీ పనులు ప్రారంభించారు. 2024 ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకు ముందు రోజుల్లో ఆస్పత్రి భవన నిర్మాణాలను పూర్తి చేయించి గత ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన చేతుల మీదుగా ఆస్పత్రిని ప్రారంభించారు.
ఇక రోగులకు క్యాన్సర్ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో వైద్యం అందుబాటులోకి వస్తుందని అందరూ భావించారు. ప్రస్తుతం ఆ ఆస్పత్రి భవనాలను పరిశీలిస్తే గదులన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. ఎన్నికల ముందు ప్రజల దృష్టి మళ్లించాలన్నా లక్ష్యంతో భవన నిర్మాణాలను ప్రారంభిచారే తప్ప క్యాన్సర్ వైద్యాని కి సంబంధించిన యంత్ర పరికరాలు రోగులకు నేటి వరకు అందుబాటులో తీసుకురాలేకపో యారు. ప్రస్తుతం కొంతమంది సిబ్బందిని నియమించటం ద్వారా క్యాన్సర్ రోగుల కోసం ఒక ఓపీ సెంటర్ మాత్రమే పని చేస్తోంది. క్యాన్సర్ రోగులకు కీలకంగా వైద్యం అందించే యంత్ర పరికరాలు లీనియర్ యాగ్జిలేటర్ సెంటర్ కేంద్రం, ఎక్స్‌రే డార్క్ రూమ్‌లు, సీటీ స్కానింగ్, ఎం.ఆర్.ఐ ఓటీ గదులు, రోగులకు అవసరమైన వార్డుల గదులన్నీ ఖాళీగా కనబడుతున్నాయి. మరో కీలకమైన వార్డు క్యాన్సర్‌ను గుర్తించి రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చే కేంద్రం, లీనియర్ యాగ్జిలేటర్ సెంటర్ విభాగంలో ఎలాంటి పరికరాలు అందుబాటులో లేవు. ఇదే విషయాన్ని సంబంధింత ఇంజనీరింగ్ అధికారులను వివరణ కోరగా క్యాన్సర్ ఆస్పత్రి యంత్ర పరికరాలు మద్రాసు పోర్టులో ఉన్నాయని చెప్పారు. త్వరలో ఆస్పత్రికి తెప్పించి రోగులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు.


