ఏపీలో డీఎస్సీని ఈ నెలలోనే జరిపి తీరతామని కూటమి సర్కారు మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే డీఎస్సీ ప్రకటనను విడుదల చేస్తామని లోకేశ్ మండలిలో తెలిపారు. అంతేకాకుండా 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా కొత్త ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరేలా ఏర్పాట్లు చేస్తామని కూడా వివరించారు.
మంగళవారం నాటి శాసనమండలి సమావేశాల్లో భాగంగా నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగావకాశాలపై చర్చ జరపాలంటూ వైసీపీ వాయిదా తీర్మానాలిచ్చింది. ఈ వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ తిరస్కరించారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు, తదనంతరం సభ కార్యక్రమాల్లో భాగంగా పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు… డీఎస్సీ ఎప్పుడూ అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రశ్నలకు లోకేశ్ ఘాటుగా స్పందించారు. డీఎస్సీ నిర్వహణపై ఇప్పటికే చాలా సార్లు ఇదే సభలో ప్రకటన చేశామని గుర్తు చేశారు. ఆరు నూరైనా నూరు ఆరైనా.. ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారాయన.
ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వంపై లోకేశ్ విరుచుకుపడ్డారు. వైసీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా విడుదల కాలేదని అన్నారు. ఏటా జాబ్ కేలండర్ అంటూ ఊదరగొట్టిన వైసీపీ నేతలు… ఇప్పుడు ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని కూటమి ప్రభుత్వం చెబుతున్నా నానా యాగి చేయడం సరికాదని హితవు పలికారు. అయినా ఉపాధ్యాయ నియామకాల్లో టీడీపీకి ఉన్న ఘన చరిత ఏ ఒక్క పార్టీకి లేదని ఈ సందర్బంగా గుర్తు చేశారు. 1994 నుంచి ఉమ్మడి తెలుగు నేలలో 2,60,184 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాగా… అందులో టీడీపీ హయాంలోనే 1,80,272 పోస్టులు భర్తీ అయ్యాయని వివరాలు ప్రకటించారు. దీన్ని బట్టి ఇప్పటిదాకా భర్తీ అయిన టీచర్ పోస్టుల్లో 70 శాతం తాము ఇచ్చినవేనని లోకేశ్ గుర్తు చేశారాన్నమాట.