ఆడ పిల్లలు పుట్టారని భార్యతో తరచూ గొడవలు పడుతున్నాడు. పెద్ద పనుషులు నచ్చజెప్పడంతో కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. ఈ క్రమంలో భార్య పిల్లలతో కలిసి కారులో ఊరికి బయలుదేరాడు. అయితే మార్గం మధ్యలో కారు రహదారి పక్కన వున్న చెట్టును ఢీ కొట్టింది. ఈ సంఘటనలో భార్య, ఇద్దరు పిల్లలు మృతి చెందగా అతడు మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా రఘునాధపాలేం మండలంలో చోటుచేసుకుంది. అల్లుడే తన కుమార్తెను, మనవరాళ్లను చంపాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. సంఘటన స్ధలంలో విగతజీవులుగా పడి ఉన్న తల్లి, ఇద్దరు పిల్లలను చూసి పలువురు కంటతడి పెట్టారు.
ఏన్కూరు మండలం రామ్‌నగర్ తండాకు చెందిన కుమారిని బోడా ప్రవీణ్‌కు ఇచ్చి 2017లో వివాహం చేశారు. 25లక్షల రుపాయలు కట్నం ఇచ్చారు. ఫిజియోధెరఫి చదివిన ప్రవీణ్ వృత్తి రిత్యా హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఫిజియోథెరపీ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కుమారి, ప్రవీణ్ దంపతులకు ఇద్దరు ఆడ పిల్లలు కృషిక, కృతిక ఉన్నారు. 20 రోజుల క్రితం ప్రవీణ్ తన స్వగ్రామం బావోజితండాకు భార్య పిల్లలతో వచ్చాడు. నిన్న సాయంత్రం ప్రవీణ్ తన భార్య పిల్లలతో కలిసి మంచుకొండ నుంచి బావోజితండాకు కారులో ప్రయాణిస్తుండగా కారు రహదారి పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న కృషిక, కృతిక అక్కడిక్కడే మృతి చెందగా తీవ్రగాయాలైనా కుమారిని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా కన్ను మూసింది. ప్రవీణ్ మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతనిని హైదరాబాద్ తరలించారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న కుమారి తల్లి దండ్రులు బంధువులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.
ప్రవీణ్ కవాలనే రోడ్డు ప్రమాదం చేశాడని ఆందోళనకు దిగారు. తన కూతురు, అల్లుడుకు మధ్య 11 నెలలుగా వివాదాలు జరుగుతున్నా యని కుమారి తండ్రి హరిసింగ్ తెలిపారు. ప్రైవేట్ హాస్పటల్‌లో చేస్తున్న కేరళ అమ్మాయితో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమెతో కలిసి కేరళ వెళ్లాడని, ఆ తర్వాత ఆచూకి తెలుసుకుని హన్మకొండలో పసరు మందు తాగించామని, అయినా ప్రవీణ్ గొడవలు మానలేదని చెప్పారు. కావాలనే కారును చెట్టుకు ఢీ కొట్టించి తల్లి, ఇద్దరు పిల్లల మరణానికి కారణమయ్యాడని కన్నీరుమున్నీరయ్యారు. తన అల్లుడిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని మృతురాలి తండ్రి కోరుతున్నాడు.


