స్వతంత్ర వెబ్ డెస్క్: ఇంతకాలం సైలెంట్‌గా ఉన్నట్లు కనిపించిన బీజేపీ(BJP).. బ్యాక్‌గ్రౌండ్‌లో మాత్రం తన పని తాను స్పీడ్‌గా చేసుకుంటూ వెళ్తోంది. ఈ కారణంగానే ఈటల రాజేందర్(Etala Rajender) ధీమాగా ప్రకటన ఇచ్చారు. అంతేకాదు.. ఇక వచ్చేవరంతా గెలుపు గుర్రాలే అనడంతో.. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో గుబులు మొదలైంది.
బీజేపీ పనైపోయిందని బీఆర్ఎస్, కాంగ్రెస్ (BRS, Congress) భావిస్తున్న టైమ్‌లో ఇప్పుడే అసలు సినిమా మొదలైందన్నట్లుగా ఈటల రాజేందర్ ఉన్నట్లుండి బాంబ్ పేల్చారు. గురువారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీలోకి భారీగా చేరికలు ఉంటాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఎంత మంది పార్టీలో చేరతారనే దానిపై నంబర్లతో సహా చెప్పేశారు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 22 మంది ముఖ్యనేతలు బీజేపీలో చేరుతారని స్పష్టం చేశారు.
ఈ చేరికలతో అధికార బీఆర్ఎస్ పార్టీలో వెన్నులో వణుకు పుట్టడం ఖాయమన్నారు. అయితే ఆ 22 మంది నేతల పేర్లు మాత్రం బయటికి పొక్కకుండా బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. అధికార పార్టీ గురించే ఈటల చెబుతుంటే.. కారు దిగి కాషాయ పార్టీలో చేరడానికి నేతలు సిద్ధమైనట్లు అర్థం చేసుకోవచ్చు. అంటే అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత బీఆర్ఎస్ నుంచి చేరికలు ఉంటాయన్న మాట.


