గ్రూపు రాజీకీయాలతో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు తెలంగాణ కమలనాథులు. ఒకరితో ఒకరికి పొసగకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యేల మధ్య విబేధాలు భగ్గుమంటున్నాయి. దీంతో ఉన్నది ఎనిమిది మందే అయినా ఒక్క తాటి మీద నడవం లేదన్న విమర్శలకు తావిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై సమన్వయం లేదు.. సమిష్టి పోరాటం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఎవరికి వారే మీడియా సమావేశాలు పెట్టుకోవడానికి.. రెండుసార్లు మాత్రమే బీజేపీ ఎల్పీ సమావేశాలు నిర్వహించడానికి కారణం వారి మధ్య సమన్వయ లోపమేనన్న చర్చ జోరుగా సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల్లోనూ పార్టీ అజెండాను పక్కనపెట్టి ఎవరి ఎజెండా వారిదే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన సుంకిశాల ప్రాజెక్టు పరిశీలనకు కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. ఇదిలా ఉంటే,.. బీజేపీ అసెంబ్లీ పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి ఒంటెద్దు పొకడపై పార్టీ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.
మరోపక్క హైకమాండ్ తీరుపై అలకబూనారు సీనియర్ నేత ఎమ్మెల్యే రాజాసింగ్. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. అంతే కాదు.. ఎల్పీ సమావేశానికి డుమ్మా కొట్టడంతోపాటు ఇటు సొంత పార్టీ ఎమ్మెల్యేలతోనూ అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణలో పాగా వేయాలని వ్యూహాలు రచిస్తున్న ఢిల్లీ పెద్దలకు పార్టీ నేతల తీరు తలనొప్పిగా మారింది.