Minister KTR| తెలంగాణ సాదించుకున్నాక సీఎం కేసీఆర్ హయాంలో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలో ఉన్న అన్ని చెరువులను అత్యాధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) నిధులతో జీహెచ్ఎంసీ పరిధిలోని 25, హెచ్ఎమ్డీఏ పరిధిలోని 25 చెరువుల డెవలప్ మెంట్ కు చేయూతనిచ్చేందుకు సంస్థలు సిద్ధమయ్యాయని అన్నారు. హైదరాబాద్ లో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న వివిధ నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులకు మంగళవారం మంత్రి కేటీఆర్ ఒప్పంద పత్రాలను అందజేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ నగర వైభవాన్ని వర్ణించారు. భాగ్యనగరానికి 440 పైచిలుకు సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. 1908లో మూసీ నదికి వరదలు వచ్చిప్పుడు.. ప్రజలను కాపాడేందుకు ఆనాటి నిజాం.. మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిచి మాట్లాడారని అన్నారు. ఆయన కట్టించిందే హిమాయాత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ప్రాజెక్టులని తెలిపారు. ఇటీవల హైదరాబాద్ ని సందర్శించిన పలువురు ప్రముఖులు విదేశాలలో ఉన్నామా? అని ఆశ్చర్యపోతున్నారని మంత్రి తెలిపారు. నగరాన్ని మనం ఎంత గొప్పగా అభివృద్ధి చేసుకుంటే అంత బాగుంటుందన్నారు. మహానగర అభివృద్ధిలో భాగంగా ఎయిర్‌పోర్ట్ మెట్రోను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. అటు అధికార బీజేపీ పై మండిపడుతూ… కేంద్రం హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలన్నారు. మన పన్నులు తీసుకుని మనకు నిధులు ఇవ్వడంలేదని వ్యాఖ్యానించారు.