ఏపీ సీఎం జగన్, వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందని వివేకా హత్య కేసులో అప్రూవర్ దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులో అప్రూవర్ గా మారాలని సునీత, సీబీఐ తనకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. మీ వైపు ఉన్నప్పుడు మంచివాడిని.. ఇప్పుడేమో చెడ్డవాడినా? అని ప్రశ్నించారు. డబ్బుల కోసం ఎర్ర గంగిరెడ్డి చెప్పినట్లు చేశానని.. తర్వాత తప్పు తెలుసుకున్నాను కాబట్టే అప్రూవర్ గా మారానని పేర్కొన్నారు.
పలుకుబడి ఉందని సీబీఐ ఎస్పీ రాంసింగ్ ను మార్చేశారని దస్తగిరి ఆరోపించారు. దర్యాప్తు అధికారి మారినంత మాత్రాన విచారణ దారి తప్పదని.. మీ పాత్ర ఉంది కాబట్టే సీబీఐ కొత్త బృందం కూడా విచారణ ముమ్మరం చేసిందన్నారు. పులివెందులలోనే ఉన్న తాను దేనికైనా సిద్ధంగానే ఉన్నానని తెలిపారు. వివేకా హత్య కేసులో మీరు తప్పు చేసినట్లు రుజువైతే సీఎం పదవికి జగన్, ఎంపీ పదవికి అవినాశ్ రెడ్డి రాజీనామా చేస్తారా? అని దస్తగిరి డిమాండ్ చేశారు.