వివేకా హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను తెలంగాణ హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. రేపు సాయంత్రం 4గంటలకు అవినాశ్ రెడ్డిని విచారణకు పిలవండని సీబీఐకి ఆదేశాలు జారీచేసింది. విచారణ సందర్భంగా అవినాశ్ రెడ్డి, సీబీఐ తరపు లాయర్లు వాడివేడిగా తమ వాదనలు వినిపించారు.
రాజకీయ కుట్రలో భాగంగా అవినాశ్ రెడ్డిని ఈ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన తరపు న్యాయవాది తెలిపారు. సీబీఐకి భయపడే అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పేర్లు దస్తగిరి చెప్పాడని వాదించారు.
అటు ఈ కేసులో వివేకా తొలుత గుండెపోటుతో చనిపోయారని అవినాశ్ రెడ్డి హడావిడి చేశారని.. పోలీసులకు కూడా ఫోన్ చేసిందని అతనే అని సీబీఐ తరపు లాయర్ వాదనలు వినిపించారు. ఈ క్రమంలో విచారణకు వస్తే అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా? అని హైకోర్టు ప్రశ్నించగా.. అవసరమైతే అరెస్ట్ చేస్తామని సీబీఐ లాయర్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం విచారణను రేపటికి వాయిదావేసింది.