క్రికెట్ ప్రేమికుల IPL సీజన్ జోరుగా సాగుతోంది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఏప్రిల్ 5న ఎస్.ఆర్.హెచ్ వెర్సెస్ సీ.ఎస్.కే మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ వీక్షించేందుకు రాష్ట్రం నలు మూలల నుంచే కాకుండా, పక్క రాష్ట్రాల నుంచి క్రికెట్ అభిమానులు వస్తున్నట్టు సమాచారం. అయితే, ఫ్యాన్స్ అభిమానాన్ని క్యాష్ చేసుకునేందుకు సైబర్ మోసగాళ్లు సిద్ధం అయ్యారు.
హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఏప్రిల్ 5న హైదరాబాద్ సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై మ్యాచ్ జరగ నుంది. ఇక, IPL సీజన్ స్టార్ట్ అయ్యిందంటే సైబర్ నేరగాళ్లు మేము సైతం అంటూ మోసాలకు రెడీ అయిపోతారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్స్ ప్రారంభించి క్రికెట్ అభిమానులకు గాలం వేయడం కామన్. తమ వద్ద ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు ఉన్నాయని పోస్టులు పెట్టి, డిస్కౌంట్లు, ఆఫర్లు అంటూ రకర కాలుగా మోసాలకు పాల్పడుతుంటారు. ఈ కేటుగాళ్ల ఘరానా మోసాలకు చిక్కిన కొందరు అమాయకులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.
ఆన్‌లైన్ పేమెంట్ ప్రోసెస్ లో క్యూఆర్ కోడ్స్ ను టికెట్ కొనుగోలుదారులకు పంపించి మోసగించడం, నగదు లావాదేవీల అనంతరం 48 గంటల్లోపు టికెట్లు స్టేడియం దగ్గరకు వచ్చి తీసుకోవాలని సందేశాలు పంపడం, ఆ సమయానికి ఆదరాబాదరా వెళ్లిన కొనుగోలుదారులకు కేటుగాళ్ల నిజస్వరూపం తెలియడం, టికెట్స్ అందక, ఎవరికీ తెలియజేయలేక…బాధితులు మూగవేదన అనుభవించడం…ఇదీ సూక్ష్మంగా IPL సీజన్ మోసాల బాగోతం. ఈ తరహా బాధితులు ఆఫ్ ది రికార్డ్ లో అనేకమంది ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. సోషల్ మీడియా వేదికగా కొందరు మోసగాళ్లు టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్నారు. చెన్నై ట్రిప్లికేన్ లో జరిగిన సీ.ఎస్.కే వెర్సెస్ ఆర్.సీ.బీ మ్యాచ్ కు బ్లాక్ లో టికెట్లు విక్రయించిన అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి ఎనిమిది టికెట్లు, 31 వేల 500 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే, నిందితులు వెంటనే బెయిల్ పై విడుదల కావడం గమనార్హం. ఇప్పటికే చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ కు మొత్తం టికెట్లు అమ్ముడు పోగా, ఆన్ లైన్ అమ్మకాలను పేటీఎం సైతం క్లోజ్ చేసింది. ఈ నేపథ్యంలో టికెట్ డిస్కౌంట్ ఆఫర్ల పై ఫిర్యాదులు అందుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి విచారణ సాగించారు. మోసాల పై క్రికెట్ అభిమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.