కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలబోతున్నాయా? రెబెల్‌గా వేరే పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి వల్ల ఇప్పుడు ఆందోళన నెలకొందా? అంటే అవుననే సమాధానమే వస్తుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం కోసం హోరా హోరీగా ప్రచారం జరుగుతోంది. ఐదేళ్ల కిందట ఇంతటి భారీ ప్రచారం జరగలేదు.. కానీ ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎన్నిక రసవత్తరంగా మారింది. అయితే కాంగ్రెస్ పార్టీ తమ ఓట్లు చీలుతాయేమనే ఆందోళనలో ఉందట. కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ప్రసన్న హరికృష్ణ.. చివరి నిమిషంలో బీఎస్పీ నుంచి బరిలోకి దిగారు. ఇప్పుడు ఈయన కూడా పోటాపోటీగా ప్రచారంలో ముగినిపోయారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఓటర్లనే లక్ష్యంగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ ఆందోళనలో మునిగిపోయింది.
వాస్తవానికి ప్రసన్న హరికృష్ణ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ వస్తుందని ఆశ పెట్టుకున్నారు. తనకు టికెట్ కేటాయించాలని రాష్ట్ర పెద్దలను కూడా పలుమార్లు కలిశారు. ఓటర్ల నమోదులో కూడా హరికృష్ణ చురుకుగా పాల్గొన్నారు. ఇంత చేసినా కాంగ్రెస్ పార్టీ హరికృష్ణకు మొండి చెయ్యి చూపించి.. అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చింది. దీంతో మొదటి నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం ఎదురు చూసిన హరికృష్ణ చివరకు బీఎస్పీ టికెట్‌పై పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో దిగారు. ఇప్పుడు హరికృష్ణ బీఎస్పీ అభ్యర్థి అయినా.. ఆయన చీల్చేది అన్నీ కాంగ్రెస్ ఓట్లే కావడంతో అధికార పార్టీలో ఆందోళన నెలకొంది. తప్పకుండా ఓట్లు భారీగా చీలుతాయని విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ఆరు నెలల ముందు నుంచే హరికృష్ణ ఎన్నికల ప్రచారంలోకి దిగారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి మరి ఎన్నికల బరిలోకి దిగారు. కాంగ్రె్స పార్టీ టికెట్ తప్పకుండా వస్తుందనే భరోసాతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలను, పట్టభద్రులను కలుస్తూ.. వారి మద్దతును కోరుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రసన్న హరికృష్ణ చేయించిన ఎన్‌రోల్‌మెంట్‌లోనూ దాదాపుగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిమానులే ఉన్నారనే చర్చ జరుగుతుంది. మరోవైపు.. నరేందర్‌రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. అయినా సరే ఇప్పటికి కూడా తాను ఎన్‌రోల్ చేయించిన ఓటర్లు మెజార్టీ స్థాయిలో ప్రసన్న హరికృష్ణకే మద్దతు తెలుపుతున్నారన్న ప్రచారం జరుగుతున్నది. పైకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నామని చెబుతున్నా.. చివరకు మొదటి ప్రాధాన్య ఓటు మాత్రం బీఎస్పీ అభ్యర్థికి వేయాలని నిర్ణయించుకున్నారట.
కాంగ్రెస్ పార్టీ టికెట్ తెచ్చుకున్న నరేందర్ రెడ్డిపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అల్ఫర్స్ విద్యా సంస్థల పూర్వ విద్యార్థులు, తల్లిదండ్రులు నరేందర్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇబ్బందిగా మారిందట. ఇక నరేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించే ముందు నాలుగు ఉమ్మడి జిల్లాల నేతలను ఎవరినీ సంప్రదించలేదని కాంగ్రెస్ నేతలు కూడా గుర్రుగా ఉన్నట్లు సమాచారం. నరేందర్ రెడ్డి తనక ధన బలంతో హైకమాండ్‌ను ప్రసన్నం చేసుకొని టికెట్ తెచ్చుకున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా పలువురు ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డి అభ్యర్థిత్వంపై అలకబూనారని.. వాళ్లు కనీసం ప్రచారంలో కూడా సహకరించడం లేదనే టాక్ వినిపిస్తుంది.
కరీంనగర్ జిల్లా పరిధిలోని ఇద్దరు ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డితో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారట. పైకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలే అయినా.. లోపల మాత్రం ప్రసన్న హరికృష్ణకు మద్దతు పలుకుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇటీవల నరేందర్ రెడ్డి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని భావించారట. అయితే తన నియోజకవర్గంలో ఈ సమావేశం నిర్వహించవద్దని ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఖరాఖండీగా చెప్పారట. మరో సీనియర్ నేతతో చెప్పించినా.. ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒప్పుకోలేదని తెలుస్తుంది. కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్సీ ఎన్నికలో ఆ పార్టీ ఎమ్మెల్యేలే పూర్తి స్థాయిలో సహకరించడం లేదు. దీంతో రాష్ట్ర నాయకత్వానికి ఏం చేయాలో పాలుపోవడం లేదట.
మొత్తానికి ఒక వైపు ప్రసన్న హరికృష్ణ రెబెల్‌గా బరిలోకి దిగి కాంగ్రెస్ ఓట్లను భారీగా చీల్చుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నరేందర్ రెడ్డికి సహకరించడం లేదు. దీంతో ఈ అంశాలన్నీ బీజేపీ అభ్యర్థికి అనుకూలంగా మారుతాయేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.