తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన వ్యూహాన్ని మార్చారా? బీజేపీని టార్గెట్ చేయకపోవడం వెనుక తన సొంత ప్రయోజనాలు దాగి ఉన్నాయా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తుంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్‌తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు కేసీఆర్. ముఖ్యంగా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లను కూరలో కరివేపాకుల తీసి పారేసేవారు. కానీ ఇటీవల కాలంలో బీఆర్ఎస్ నాయకులు కానీ.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ కానీ.. బీజేపీపై విమర్శలు చేయడం లేదు. గతంలో చేసినట్లు బీజేపీపై పెద్దగా ఆరోపణలు కూడా చేయడం లేదు.
ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏదైనా కంప్లైంట్ చేయాలంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. సాధ్యమైనంత వరకు బీజేపీ మంత్రులతో సఖ్యతగా ఉండటానికి ప్రయత్నించడమే కాకుండా.. వారితో పరిచయాలు పెంచుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక కేసీఆర్.. చాలా కాలం తర్వాత తెలంగాణ భవన్‌కు వచ్చారు. అక్కడ జరిగిన పార్టీ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆ సమావేశంలో అధికార కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు. కానీ కేంద్రంలో ఉన్న బీజేపీని మాత్రం పల్లెత్తు మాట కూడా అనకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి బీఆర్ఎస్‌కు బీజేపీ వల్లే ప్రమాదం ఎక్కువగా ఉంది. అసెంబ్లీ ఎన్నికల నుంచి బీఆర్ఎస్ ఓటు బ్యాంకు అంతా బీజేపీ వైపుకు మళ్లుతుంది. ఈ విషయం పార్లమెంటు ఎన్నికల సమయంలో స్పష్టంగా తెలిసిపోయింది. అలాంటప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీజేపీని కూడా టార్గెట్ చేయాలి. ఆ పార్టీ పట్ల మెతక వైఖరి ప్రదర్శిస్తే బీఆర్ఎస్‌కే నష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయినా సరే కేసీఆర్ మాత్రం బీజేపీతో జగడం పెట్టుకోవడానికి రెడీగా లేరట. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అభ్యర్థిని దింపకపోవడం.. పైగా బీజేపీకి మద్దతు లభించేలా కాంగ్రెస్‌పై భారీగా విమర్శలు, ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది
అయితే కేసీఆర్ రాజకీయ వ్యూహాలపై అంత త్వరగా ఒక అంచనాకు రాలేము. కేసీఆర్ ఓడిపోయినా.. ఆయన రాజకీయ చతురతను తక్కువగా అంచనా వేయకూడదు. గతంలో బీజేపీతో బహిరంగ యుద్దం ప్రకటించిన కేసీఆర్.. ఆ తర్వాత ఆ పార్టీపై విమర్శలు చేయకుండా ఆగిపోయారు. కవితను అరెస్టు చేసిన సమయంలో కూడా బీజేపీని ఒక్క మాట అనలేదు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. గతంలో బీజేపీతో పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలు నామరూపాల్లేకుండా పోయాయి. బలమైన ప్రాంతీయ పార్టీల్లో చీలక తీసుకొచ్చిన చరిత్ర బీజేపీకి ఉంది. అందుకే పార్టీని కాపాడుకునే ఉద్దేశంతోనే బీజేపీపై కేసీఆర్ ఒక్క మాట కూడా అనలేదనే టాక్ వినిపిస్తోంది.
చాలా రాష్ట్రాల్లో బీజేపీ బలపడిన తీరు చూస్తే.. ఏదో ఒక ప్రాంతీయ పార్టీ బలికాక తప్పదనే తెలుస్తుంది. ఏపీలో బీజేపీ బలపడటానికి సరైన మార్గాలు కనపడటం లేదు. ఆ రాష్ట్రంలో టీడీపీ, జనసేన బలంగా ఉన్నాయి. వైసీపీ ఓడిపోయినా.. ఇప్పటికీ ప్రజల్లో ఆ పార్టీ బలం తగ్గలేదు. కానీ తెలంగాణలో పరిస్థితి వేరు. ఇక్కడ బీజేపీ ఎదగడానికి చాలా సులువైన మార్గాలు ఉన్నాయి. అందుకే మొదటి నుంచి బీఆర్ఎస్‌ను టార్గెట్ చేసి.. ఉత్తర తెలంగాణలో బీజేపీ బలంగా పుంజుకుంది. రాష్ట్రమంతా ఇదే వ్యూహాన్ని బీజేపీ అమలు చేసుకుంటూ వస్తోంది.
బీజేపీ వ్యూహాన్ని ముందుగానే పసిగట్టిన కేసీఆర్.. తనదైన రూట్లో పార్టీని కాపాడుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. బీజేపీని టార్గెట్ చేస్తే.. ఆ పార్టీ మరింత రెచ్చిపోయి బీఆర్ఎస్‌ను నాశనం చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే చాకచక్యంగా అధికార కాంగ్రెస్‌ను మాత్రమే కేసీఆర్ టార్గెట్ చేశారనే టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీ చాలా వేగంగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ ప్లేస్‌నే లాక్కోవాలని అనుకుంటోంది. ఇలాంటి సమయంలో ఆ పార్టీని చూసి చూడనట్లుగా ఉండటం మంచిదని కేసీఆర్ భావిస్తున్నారు. మరి ఇది సరైన వ్యూహమా.. కాదా అనేది కాలమే నిర్ణయిస్తుంది.