స్వతంత్ర, వెబ్ డెస్క్: ధరణిని బంగాళాఖాతంలో కలుపుదామంటున్న కాంగ్రెస్ ను బంగాళాఖాతం కలపాలని నిర్మల్ బహిరంగసభ వేదికగా పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. నేడు నిర్మల్ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం.. పైరవీ లేకుండా, కష్టం లేకుండా రైతు ఖాతాలో నేరుగా డబ్బులు వేస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. రైతు భీమ సైతం ఇబ్బందులు లేకుండా నేరుగా రైతు కుటుంభానికి చేరుతున్నాయని.. ఇది కేవలం ధరణి పోర్టల్ వల్లే సాధ్యమైందని అన్నారు. మహారాష్ట్ర వాసులు సైతం బీఆర్ఎస్ కు హృదయ పూర్వక స్వాగతం పలుకుతున్నారని… తమ ప్రభుత్వం పై వారు ఆసక్తితో ఉన్నారని తెలిపారు. కుల మత వర్గ బేధం లేకుండా ప్రతి ఒక్కరినీ ఆదుకుంటున్న ప్రభుత్వం బీఆర్ఎస్ అని అన్నారు.
ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం.. గతంలో కలుషిత నీటితో వ్యాధుల బారిన పడ్డ ప్రాంతం అదిలాబాద్ అని గుర్తుచేశారు. ఇప్పుడు ఉమ్మడి జిల్లాలో 4 మెడికల్ కాలేజీలు జిల్లాకోకటి చొప్పున అందుబాటులోకి తీసుకొస్తున్నామని అన్నారు. ఎన్నికలు వస్తున్నాయని ఎవడో ఏదో చెబుతుంటారు.. మీరు వారికి బుద్ది చెప్పాలి..అందరినీ ఆదుకుంటూ అభివృద్ధిలో ముందుకుపోతున్న తమని మళ్ళీ ఆశీర్వదించాలని సీఎం ప్రజలకు తెలియజేశారు.