సంచలనం సృష్టిస్తున్న నీట్ ప్రశ్నపత్రం లీకేజీ దర్యాప్తు అధికారులు తెలంగాణ వైపు దృష్టిసారిస్తున్నారు. ఈ వ్యవహారం అచ్చం 2016లో ఇక్కడ వెలుగు చూసిన ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీని పోలి ఉండటం.. ఇప్పటి మాదిరిగానే అప్పుడు కూడా బిహార్ ముఠా కీలకపాత్ర పోషించడంతోపాటు రెండు ఘటనలకూ మధ్య సారూప్యత ఉండటమే ఇందుకు కారణం. నీట్ కేసు దర్యాప్తు జరుపుతున్న సీబీఐ అధికారులు ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ దర్యాప్తు జరిపిన సీఐడీ అధికారులను సంప్రదించనున్నట్లు తెలుస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం 2016 జులై 25న తెలంగాణ సీఐడీ అధికారులు ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీకి సంబం ధించి కేసు నమోదు చేశారు. అదే ఏడాది జులై 9న పరీక్ష జరిగిన ముందు రోజు వారెక్కడున్నారో ఆరా తీయగా కొన్ని ఆధారాలు లభించాయి. ప్రశ్నపత్రం ముందే లీక్ అయిందని, డబ్బు చెల్లించిన 200 మందికిపైగా విద్యార్థులను దళారులు దేశంలోని ఐదు ప్రాంతాలకు తరలించి అక్కడ శిక్షణ ఇచ్చి పరీక్ష రోజు హైదరాబాద్ తరలించినట్లు తేలింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి చెందిన శివ బహద్దూర్ సింగ్ అసలు నిందితుడిగా గుర్తించారు. ఇప్పుడు నీట్ వ్యవహారంలోనూ విద్యార్థులను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పించారు. ఇందులో బిహార్ రాజధాని పట్నాకు చెందిన వ్యక్తులు కీలకపాత్ర పోషించి నట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. రెండు లీకేజీల్లోనూ సారూప్యతలు ఉండడంతో నీట్ దర్యాప్తు బృందం ఎంసెట్ కేసు నిందితుల వివరాలు తీసుకొని వారు ఎక్కడెక్కడ ఉన్నారని ఆరా తీయనున్నట్లు సమా చారం.


