CM Jagan: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఇవాళ పార్టీ ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలతో సమావేశం అవుతారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో నిర్వహించనున్న సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఓటమి నేపథ్యంలో.. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు.. వచ్చే ఎన్నికలకు ఎలా సన్నద్ధమవ్వాలనే విషయంలో జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్షించనున్నారు. గడప గడపకు కార్యక్రమంలో అందిన వినతుల పరిష్కారం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. ఇక, జగనన్నే మన భవిష్యత్ కార్యక్రమంపైనా సీఎం జగన్ ఈ సమావేశంలో దిశానిర్దేశం చేయనున్నారు. మరోవైపు ఏపీలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని రద్దు చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అధికారికంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రచారంపై స్పందించలేదు. అయితే ఇవాళ జరిగే సమావేశంలో ముందస్తు ఎన్నికల అంశంపై చర్చ జరిగే అవకాశాలు లేకపోలేదు. ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. లాభమా.. నష్టమా.. అనే విషయాన్ని పార్టీ ఎమ్మెల్యేలను అడిగి తెలుసుకునే ఛాన్స్ ఉంది.


