స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీ జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్ట్ కు మళ్లీ ప్రాణం వచ్చింది. కొంతకాలంగా నిలిచిపోయిన పోలవరం నిర్మాణానికి తిరిగి నిధులు కేటాయించేందుకు కేంద్రం ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టు పనుల్ని సమీక్షించేందుకు సీఎం జగన్ నేడు పోలవరంలో పర్యటించనున్నారు. పోలవరం ప్రాజెక్టును సందర్శించి క్షేత్రస్ధాయిలో పనుల తాజా పరిస్ధితిని సీఎం జగన్ తెలుసుకోనున్నారు. దీంతో జగన్ టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది.
పోలవరం ప్రాజెక్టు ఎత్తు, నిర్వాసితులకు పరిహారం విషయంలో తాజాగా ఢిల్లీలో జరిగిన కేంద్ర జల్ శక్తి శాఖ భేటీలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏపీ కోరినంత కాకపోయినా ప్రాజెక్టు పరిమాణం తగ్గించి నిధులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. అలాగే పరిహారం విషయంలోనూ కేంద్రం సూచించిన ఎత్తు వరకూ కడితే నిధులు ఇచ్చేందుకు సరేనంది. దీంతో రాష్ట్రం కూడా ఇప్పుడు తాజా పరిస్ధితిని సమీక్షిస్తోంది.
మరోవైపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 2025 జూన్ వరకూ గడువు పెంచిన ఏపీ ప్రభుత్వం, దాన్ని అంగీకరించాలని కేంద్రాన్ని కోరింది. దీంతో కేంద్రం కూడా విడదల వారీగా నిధులు కేటాయించేందుకు వెసులుబాటు లభించింది. ఈ నేపథ్యంలోనే పోలవరం ప్రాజెక్టు పూర్తిపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి.
సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టులోని ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్, ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యామ్‌లో పనులను పరిశీలించనున్నారు అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి ప్రాజెక్ట్ పనులు పరిశీలించే ప్రాంతాల్లో ప్రాజెక్ట్ నిర్మాణ పనుల ప్రగతికి సంబంధించి ఫొటో ఎగ్జిబిషన్ ని వీక్షించనున్నారు. సీఎం పర్యటన ప్రదేశాల్లో విస్తృత బందోబస్తు అధికారులు ఏర్పాటు చేశారు.