YSR Asara Scheme |రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి శనివారం మూడో విడత వైఎస్‌ఆర్ ఆసరా నిధులను లబ్ధిదారుల ఖాతాలో జమ చేశారు. ఏలూరు జిల్లా దెందులూరులో నిర్వహించిన నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొని.. 78.94 లక్షలమంది లబ్ధిదారులకు ₹6,419 కోట్లు విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మహిళా సాధికారతే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. మహిళలపై వడ్డీ భారం పడకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతం తగ్గిస్తూ వస్తున్నామని అన్నారు. ప్రస్తుతం పొదుపు సంఘాల పనితీరు ఎలా మారిందో ప్రత్యక్షంగా కనిపిస్తోందన్నారు. 91శాతానికి పైగా మహిళా సంఘాలు ఏ గ్రేడ్ సంఘాలుగా మార్పుచెందాయని వెల్లడించారు. ఇదిలా ఉంటే సభలో మరో చోద్యం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున డ్వాక్రా మహిళలను అధికార పార్టీ నేతలు తరలించారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలోనే సభా ప్రాంగణం నుంచి మహిళలు ఇంటిదారి పట్టారు. కార్యక్రమం పూర్తికాకముందే ప్రజలు బయటకు వెళ్లిపోవడంతో ఈ విషయంలో రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.