సీఎం చంద్రబాబు పాలనపై ఫోకస్ పెట్టారు. ప్రక్షాళనలో తన మార్క్ దిశగా అడుగులు వేస్తున్నారు. అన్ని విభాగాల్లో మార్పులు, చేర్పులకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు సీఎంవో సిబ్బంది, సీఎస్, డీజేపీతో సమావేశమయ్యారు చంద్రబాబు. ప్రభుత్వ ప్రక్షాళన విషయంలో తన మార్క్ ఏంటో స్పష్టం చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తిరుమలకు వెళ్లినప్పుడు ప్రకటించనట్టుగా టీటీడీలో ప్రక్షాళన మొదలు పెట్టారు. ధర్మారెడ్డిని తప్పించి ఈవోగా సీనియర్ ఐఎఎస్ శ్యామలరావుకు పోస్టింగ్ ఇచ్చారు.సమర్థులైన అధికారులు, నిబంధనల ప్రకారం పనిచేసే వారికి కీలక పోస్టులు ఇవ్వాలని నిర్ణయించారు. వైసీపీతో అంటకాగిన వారిని, జగన్‌కు ఏజెంట్లుగా పనిచేసిన వారిని దూరంగా పెట్టనున్నారు. 5 హామీలపై అమలుపై ప్రణాళికతో, వేగంగా పనిచేయాలని ఉన్నతాధికారులకు చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాలసీల ప్రకటనకు ముందే సమగ్ర కసరత్తు జరగాలన్నారు. నిర్ణయం వెలువడిన తరువాత జాప్యం ఉండకూడదని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.