మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. టాయిలెట్‌లో అమ్మాయిల వీడియోలు చిత్రీకరించడం కలకలం రేపుతుంది. ఇవాళ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన నక్క సిద్ధార్థ అనే థర్డ్ ఇయర్ విద్యార్థి అమ్మాయిల టాయిలెట్ గోడపై సెల్ ఫోన్ నుంచి వీడియోలు చిత్రీకరించాడు. దీన్ని గమనించిన ఓ విద్యార్థిని విషయాన్ని కళాశాల సిబ్బందికి చెప్పారు. వెంటనే ఆ ఫోను స్వాధీనం చేసుకున్న ప్రిన్సిపల్ షీ టీమ్స్ కు సమాచారం ఇచ్చారు. పరీక్ష పూర్తి అయిన ఆ విద్యార్థి తన సెల్ ఫోన్ చోరీకి గురైనట్టు ఫిర్యాదు చేయడం ఆశ్చర్యాన్ని గురిచేసింది. అనుమానించిన ప్రిన్సిపల్ అతన్ని బయటకు వెళ్లకుండా అక్కడే ఉంచుకొని పోలీసులకు అప్పగించారు. అయితే నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.
గతంలో కూడా ఓసారి ఇలాంటి ఘటన జరిగితే తాము ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిన అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని డి.ఎస్.పి వెంకటేశ్వర్లు తెలిపారు. విద్యార్థులు మాత్రం తమకు న్యాయం చేయాలని ఆ వీడియోలో ఏం రికార్డయింది అనే విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విషయం తనకు తెలిసిన వెంటనే సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని పోలీసులకు అప్పగించినట్టు చెప్తున్నారు. మొత్తంగా కళాశాల టాయిలెట్లో జరిగిన వీడియో చిత్రీకరణ ఇప్పుడు సంచలనంగా మారింది. భవిష్యత్తులోనైనా ఇలాంటి ఘటన జరగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.