స్వతంత్ర వెబ్ డెస్క్: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా ఉన్న టీడీపీ నేత నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను హైకోర్టు ఈ రోజు విచారించింది. ఈ సందర్భంగా ఈ కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. లోకేశ్ ను అరెస్ట్ చేయబోమని, సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇస్తామని కోర్టుకు అడ్వొకేట్ జనరల్ తెలిపారు. ఎఫ్ఐఆర్ లో దర్యాప్తు అధికారి మార్పులు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
41ఏ కింద లోకేశ్ కు నోటీసులు ఇచ్చి విచారిస్తామని కోర్టుకు ఏజీ తెలిపారు. ఒకవేళ దర్యాప్తుకు లోకేశ్ సహకరించకపోతే, ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తామని, ఆ తర్వాత అరెస్ట్ చేస్తామని చెప్పారు. 41ఏ నిబంధనలను పూర్తిగా పాటిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో హైకోర్టు స్పందిస్తూ… లోకేశ్ అరెస్ట్ పై ఆందోళన లేనందువల్ల విచారణను ముగిస్తున్నామని తెలిపారు. మరో వైపు, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్లను ఎఫ్ఐఆర్ నుంచి తొలగించినట్టు న్యాయ నిపుణులు చెపుతున్నారు.