ఏపీ మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత జగన్ మోహన్‌రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ..డిప్యూటీ స్పీకర్ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో ఈ పిటిషన్‌పై గత కొంతకాలంగా కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. నేడు రఘురామ పిటిషన్‌పై ధర్మాసనం కీలక నిర్ణయం వెల్లడించింది. ఈ క్రమంలో కీలక వ్యాఖ్యలు చేసింది న్యాయస్థానం.
జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్‌చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం రఘురామ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరిపింది. జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవని, కాబట్టి రద్దు చేయాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాగే సీబీఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమన్నది. అలాగే కేసులను పర్యవేక్షణ చేయమంటారా అంటూ పిటిషనర్‌పై అసహనం వ్యక్తం చేసింది.
ఒకానొక తరుణంలో పిటిషన్‌ను డిస్మిస్ చేస్తామని పిటిషనర్‌ను సుప్రీంకోర్టు హెచ్చరించింది. దీంతో పిటిషన్‌ను వెనక్కి తీసుకుంటామని రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలిపారు. జగన్ బెయిల్ రద్దు, కేసుల ట్రయల్ విచారణ ధర్మాసనం మార్పు చేయాలని..రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో ఓ పిటిషన్ వేశారు. గతంలో ఈ పిటిషన్‌ను జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్ ధర్మాసనం విచారించగా..ఆ తర్వాత జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్రశర్మ ధర్మాసనం ముందుకెళ్లింది.
అంతకుముందు కోర్టులో రఘురామ తరఫు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు కదల్లేదని..ఒక్క డిశ్ఛార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే చెప్పిందని..తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు.
అయితే.. సీబీఐ కేసుల వివరాలు, ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. మరోవైపు..ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని..ఇంకా కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. అన్నివైపులా వాదనలు విన్న ద్విసభ్య ధర్మాసనం..చివరకు రఘురామ పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ నేడు తీర్పు ఇచ్చింది.