తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు ఎట్టకేలకు బెయిల్ లభించింది. రాజకీయ నేతలు, హైకోర్టు న్యాయమూర్తులు సహా పలువురి ఫోన్లు ట్యాప్ చేశారంటూ నమోదైన కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అరెస్టయిన తిరుపతన్న 10 నెలలుగా జైలులోనే ఉన్నారు. మెుదట బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును తిరుపతన్న పలుమార్లు ఆశ్రయించగా నిరాకరించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం తిరుపతన్నకు బెయిల్ మంజూరు చేసింది.
కేసు విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సిద్ధార్థ లూథ్రా, తిరుపతన్న తరఫున సిద్ధార్థ దవే వాదనలు వినిపించారు. కేసు దర్యాప్తునకు ఇంకా ఎంత సమయం పడుతుందని జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర ధర్మాసనం లూథ్రాను ప్రశ్నించగా.. నాలుగు నెలలంటూ ఆయన తెలిపారు. ఈ మేరకు ఇంకెంత కాలమంటూ ఉన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. అయితే నిందితుడు 10 నెలలుగా జైలులోనే ఉన్నారని, బెయిల్ మంజూరు చేయాలని తిరుపతన్న తరఫు న్యాయవాది సుప్రీంకోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు.. పిటిషినర్ వాదనలతో ఏకీభవిస్తూ బెయిల్ ఇచ్చింది. కేసు విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయెుద్దంటూ తిరుపతన్నను ఆదేశించింది.