‘‘ఏయ్ భావనా, ఏటే నన్నొగ్గేసి ఎళ్లిపోతావటే…ఏయ్ భావనా’’
ఈ మాటలు వింటుంటే మీకేదో చూసిన సినిమా గుర్తువస్తున్నట్టుగా అనిపిస్తోంది కదా…అదేనండి ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన యూత్ ఫుల్ సినిమా ‘కేరింత’…
సుమన్ అశ్విన్, శ్రీ దివ్య హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రంలో వారి ఫ్రెండ్స్ పాత్రల్లో ఒదిగిపోయి నటించిన మరో జంట ఉంది…అదే పార్వతీశం, సుకృతి జంట…ఇందులో సుకృతి అంటే ఎవరికీ తెలీదు. తన పేరే సినిమాలో భావన…ఈ పేరు పాపులర్ అయినంతగా సినిమాలో మరే పేరు కాలేదంటే ఆశ్చర్యం అనిపించక మానదు.
ఒక శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చిన అమాయక కుర్రాడిని మార్చడానికి ప్రయత్నించి, ఆ ప్రయత్నంలో ప్రేమలో పడిన అమ్మాయిగా భావన చక్కగా నటించింది. 2015లో విడుదలైన చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇంతకీ విషయం ఏమిటంటే…ఈ ముద్దుగుమ్మ భావనా పెళ్లి పీటలెక్కింది. అక్షయసింగ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. విషయం తెలిసి నెట్టింట చాలామంది యువత ‘ఎంత పనిచేశావు భావనా’ అంటూ ఘొల్లుమంటున్నారు. కొందరు మాత్రం శుభాకాంక్షలు చెబుతున్నారు.
కేరింత సినిమా తర్వాత ఈ బ్యూటీ విదేశాలకు చదువుల నిమిత్తం వెళ్లిపోయింది. తర్వాత ఎంగేజ్ మెంట్ ఫొటోలు, పెళ్లి ఫొటోలు పోస్ట్ చేస్తూ వచ్చింది. పర్సనల్ విషయానికి వస్తే సుకృతి తల్లి చనిపోయింది. తండ్రి పెంపకంలోనే పెరిగింది. 1993లో జన్మించింది. ఢిల్లీలో స్కూలు విద్యాభ్యాసం జరిగింది. రాజస్తాన్ బనస్తలి యూనివర్శిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసింది.
ఫ్యాషన్ రంగంలో తనకిష్టం కావడంతో తండ్రి అంగీకరించాడు. అలాగే సినిమాలో అవకాశం వస్తే ఓకే అన్నారు. ఇప్పుడు తండ్రి తెచ్చిన సంబంధాన్ని భావనా ఓకే చెప్పింది. ఒకరి ఉద్దేశాలని ఒకరు గౌరవించుకున్న ఉత్తమ తండ్రీ కూతుళ్లని నెట్టింట కొనియాడుతున్నారు.