అతను ఒక టెక్నిషియన్…ఎవరో లిఫ్ట్ లో ఇరుక్కుపోయారని అంటే పరుగుపరుగున అక్కడికి వెళ్లాడు. అందులో ఉన్న వ్యక్తిని విడిపించబోతుండగా తను ఇరుక్కుపోయి, రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. ఈ దురదృష్టకర సంఘటన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అత్తాపూర్ వెంగమాంబ గ్రాండ్ హోటల్ లో జరిగింది.
వివరాల్లోకి వెళితే…ఈ హోటల్ లో ఒక శుభకార్యం జరుగుతుంటే బంధువులు, స్నేహితులు అందరూ హాజరయ్యారు. అందరితో పాటు ఆంధ్రా నుంచి ఒక పోలీసు అధికారి కూడా హాజరయ్యారు. తిరిగి వెళుతుండగా అనుకోకుండా అతను లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు. విషయం తెలిసిన హోటల్ యాజమాన్యం దానిని తెరవడానికి విశ్వ ప్రయత్నం చేసింది.
చివరికి ఒక టెక్నీషియన్ని పిలిచారు. అతను వచ్చి మరమ్మతులు చేస్తుండగా అనుకోకుండా తను లిఫ్ట్ మధ్యలో ఇరుక్కుపోయాడు. ఈ క్రమంలో తన రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు. పోలీసులకు సమాచారం అందివ్వడంతో వాళ్లు హుటాహుటిన వచ్చి ఇద్దరినీ కాపాడి, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.