రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీది సుదీర్ఘ ప్రస్థానం. తొలి లోక్‌సభ ఎన్నికల్లో కమలం పార్టీ పోటీ చేసి నాలుగు దశాబ్దాలు పూర్తవుతోంది. ఈ సుదీర్ఘ ప్రస్థానంలో అనేక అవరోధాలు, అవాంతరాలు దాటుకుని వచ్చింది బీజేపీ. రెండు సీట్ల నుంచి ప్రస్తుత 303 సీట్ల స్థాయికి ఎదిగింది. 1984లో బీజేపీకి దేశవ్యాప్తంగా వచ్చిన సీట్లు రెండే రెండు. ఒకటి ప్రస్తుత తెలంగాణలోని హన్మకొండ. రెండు గుజరాత్‌లోని మెహ్సానా. హన్మకొండలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీ నర్శింహారావుపై బీజేపీ టికెట్ పై పోటీ చేసిన చందుపట్ల జంగారెడ్డి విజయం సాధించారు. పీవీపై 54,198 ఓట్ల మెజారిటీతో చందుపట్ల జంగారెడ్డి గెలిచారు.
నాలుగు దశాబ్దాల కాలంలో కమలం పార్టీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంది. అయితే బీజేపీ ఎదుగుదలకు ఊతమి చ్చింది 90ల నాటి రామజన్మభూమి ఉద్యమమే. ఇదే రామమందిర ఉద్యమంగా ప్రసిద్ది చెందింది. రామజన్మభూమి ఉద్యమానికి అనుకూలంగా 1989 జూన్‌లో హిమాచల్ ప్రదేశ్ పాలంపూర్‌లో జరిగిన పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం ఒక తీర్మానం చేసింది. ఈ మేరకు పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతిని పురస్కరించుకుని 1990 సెప్టెంబర్ 25న ఎల్ కే అద్వానీ రథయాత్ర ప్రారంభిం చారు. గుజరాత్‌లోని సోమ్‌నాథ్ నుంచి రామజన్మభూమి అయిన అయోధ్య వరకు రథయాత్ర నిర్వహిం చాలని అద్వానీ లక్ష్యంగా పెట్టుకున్నారు.
వాస్తవానికి 1990 అక్టోబర్ 30నాటికి అయోధ్య చేరుకోవాలన్నది రథయాత్ర ప్రణాళిక. అయితే అక్టోబర్ 23న బీహార్‌లోని సమస్తిపూర్‌లో అద్వానీ రథయాత్రను అప్పటి లాలూ ప్రసాద్ ప్రభుత్వం అడ్డుకుంది. అంతేకాదు అద్వానీని అరెస్టు చేసి ఐదు వారాలపాటు నిర్బంధించింది లాలూ సర్కార్. రథయాత్రను అడ్డుకోవడంపై దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. అంతేకాదు బీజేపీ విస్తరణకు బాటలు వేసింది. రథయాత్రను అడ్డుకున్న ప్రభావం 1991 నాటి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించింది. 1991లో తొలిసారిగా ఉత్తరప్రదేశ్‌లో కల్యాణ్ సింగ్ నాయకత్వాన బీజేపీ సర్కార్ ఏర్పడింది. బీజేపీ ఎదుగుదలలో వాజ్‌పేయి, అద్వానీ పాత్ర కీలకమైనది. 1994 నుంచి 2004 వరకు కమలం పార్టీని ఈ ఇద్దరు నేతలు ముందుండి నడిపించారు. మొదట మౌలికంగా కాంగ్రెస్‌ను వ్యతిరేకించే శక్తులను కూడగట్టారు. ఆ తరువాత హిందూత్వ అజెండాతో దేశవ్యాప్తంగా ఓట్‌బ్యాంక్ పెంచుకున్నారు. ఈ సమయంలో బీజేపీ అగ్ర నాయకత్వం వ్యూహాత్మ కంగా వ్యవహరించింది. వ్యక్తులపై ఆధారపడకుండా, సంస్థాగతంగా బలోపేతమైంది. తన ఐడియాలజీని సులభంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలుగా పటిష్ట యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుంది. అంతేకాదు ప్రజల స్థానిక అవసరాలకు అనుగుణంగా వ్యూహాలను రూపొందిం చుకుంది. ఈ నేపథ్యంలో 1996, 1998, 1999 ఎన్నికల్లో దేశంలో అతి పెద్ద పార్టీగా బీజేపీ అవతరిం చింది. దీంతో అటల్ బిహారీ వాజ్‌పేయి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది బీజేపీ అధిష్టానం.
బీజేపీ ఎదుగుదలలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సంస్థాగత బలం కూడా కలిసివచ్చింది. కుల, మత ,ఆర్థిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా కమలం పార్టీ వ్యూహాలు రూపొందించుకుంది. సోషల్ ఇంజ నీరింగ్‌ను ఒక ఆయుధంగా చేసుకుంది. ప్రతి ఎన్నికనూ ఒక సవాల్ గా తీసుకుని పోరాడింది కమలం పార్టీ. 2004 నుంచి జరిగిన యూపీఏ కూటమి పదేళ్ల పాలనలో అనేక కుంభకోణాలు వెలుగు చూశాయి. టూజీ, కోల్ స్కామ్, కామన్వెల్త్, ఆదర్శ్ కుంభకోణాల కాంగ్రెస్ ఇమేజ్ను బాగా దెబ్బ తీశాయి. ఈ నేపథ్యంలో 2004లో నరేంద్ర మోడీని గుజరాత్ నుంచి జాతీయ రాజకీయాల్లోకి తీసుకు వచ్చింది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలో 2004 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ తరువాత 2019 ఎన్నికల్లో మరోసారి విజయదుందుభి మోగించింది. ఈ నేపథ్యంలో మూడోసారి విజయం కోసం కమలనాథులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.


