స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఎన్నికల వేళ కేసీఆర్ దొరకు బీసీలు గుర్తుకొచ్చారని.. ఓట్ల కోసం లక్ష సాయమంటూ ‘నయా’వంచనకు తెరలేపాడని సీఎం కేసీఆర్ పై తనదైన రీతిలో విరుచుకుపడ్డారు వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల. ఇప్పటికే దళితబంధు పేరుతో దళితులను దగా చేశాడని… గిరిజనబంధు అంటూ ఊరించి గిరిజనులను ఉసూరు మనిపించాడని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. ఇప్పుడు బీసీలను మోసం చేసేందుకు దొర సిద్ధమయ్యాదంటూ వ్యంగ్యాస్త్రాలు ప్రయోగించారు. 9 ఏళ్లుగా బీసీలకు కేటాయించిన నిధులు పక్కదారి పట్టించాడని పేర్కొన్నారు. బీసీలకు 55వేల కోట్ల బడ్జెట్ అని చెప్పడమే కాని రూపాయి ఇచ్చింది లేదు. స్వయం ఉపాధి రుణాల కోసం 6 లక్షల మంది బీసీ యువత ఎదురుచూస్తుంటే ఒక్కరికి లోన్ ఇవ్వలేదు. బీసీ బిడ్డలకు రూ.3 వేల కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ కు దిక్కులేదని మండిపడ్డారు.
“ఎంబీసీ కార్పొరేషన్ కు రూ.3 వేల కోట్లు కేటాయిస్తే రూ.3 కోట్లు కూడా ఖర్చు చేయలేదు. ఐదేండ్ల కింద హామీ ఇచ్చిన ‘బీసీ సబ్ ప్లాన్’ అటకెక్కింది. 50 శాతం రిజర్వేషన్లు పెంచాలనే ప్రతిపాదన కాగితాలకే పరిమితమైంది. మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాధాన్యతే లేదు. బీసీల ఆత్మగౌరవ భవనాలు పునాదులు దాటలేదు. బీసీల కుల గణన అంటూ అసెంబ్లీలో తీర్మానం చేసి తెర చాటున కేంద్రంతో లాలూచీ పడ్డాడు. బీసీ బిడ్డలు బర్లు, గొర్లు కాచుకోవాలె.. చేపలు పట్టుకోవాలె.. కేసీఆర్ కుటుంబం మాత్రం రాజ్యాలు ఏలాల్నా? ఇన్నాళ్లు బీసీలంటే చిన్నచూపు చూసిన దొరకు.. 60లక్షల బీసీ కుటుంబాలు బుద్ధి చెప్పేందుకు రెడీగా ఉన్నాయి.” – వై.ఎస్. షర్మిల


