తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ కౌంటరిచ్చారు. పవన్‌కు రేవంత్ రెడ్డి ఏ విషయంలో గొప్పగా కనిపించారో తనకు అర్థం కావడం లేదన్నారు. వాళ్లిద్దరి మధ్య ఉన్న అవగాహన ఏంటో తనకు తెలియడం లేదని చెప్పారు. ప్రజలకు హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేయనందుకు నచ్చారా..అంటూ ప్రశ్నించారు. 6 గ్యారెంటీలు అమలు చేసినట్టు పవన్‌కళ్యాణ్‌కు ఎవరైనా చెవిలో చెప్పారేమో.. అంటూ సెటైర్లు వేశారు.
అల్లు అర్జున్, రేవంత్ రెడ్డికి ఎక్కడ చెడిందోనని కామెంట్స్ చేశారు. 14 శాతం కమీషన్ దగ్గర చెడిందేమోనని ఆరోపించారు. ముగ్గురు మంత్రులు కమీషన్లు వసూలు చేస్తున్నారు.. తెలంగాణ సచివాలయం, మంత్రుల పేషీలు కమీషన్లకు అడ్డాగా మారాయని ఆరోపించారు. ఇక్కడి కమీషన్లతో కాంగ్రెస్ మంత్రులు ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆరోపించారు. ఇక మంత్రులందరికీ సీఎం కావాలని ఉందని.. ఢిల్లీకి డబ్బుల సంచులు పంపడం వల్లే రేవంత్ రెడ్డికి సీఎం పదవి నిలబడుతోందని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
అసలు పవన్ ఏమన్నారంటే..
తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి గొప్ప నాయకుడని ప్రశంసించారు. రేవంత్ రెడ్డి కష్టపడి కిందిస్థాయి నుంచి ఎదిగారని పవన్ కళ్యాణ్ ప్రశంసించారు. వైసీపీ విధానాల తరహాలో తెలంగాణలో ఆయన వ్యవహరించలేదని అన్నారు. సినిమాల బెనిఫిట్‌షోలకు అవకాశమిచ్చారు. టికెట్ ధర పెంచుకోవడానికి కూడా అవకాశమిచ్చారు. రేవంత్ సహకారంతోనే సినిమాల కలెక్షన్లు బాగా పెరిగాయి. సలార్ , పుష్ప2 వంటి సినిమాలకు భారీ వసూళ్లు రావడానికి కూడా ఒక రకంగా రేవంతే కారణమని చెప్పారు. పుష్ప2 సినిమాకు సీఎం రేవంత్ రెడ్డి పూర్తిగా సహకరించారని అన్నారు. టికెట్ రేట్ల పెంపునకు అవకాశం ఇవ్వడం కూడా చిత్ర పరిశ్రమను ప్రోత్సహించడమే అవుతుంది కాదా అని పవన్ కళ్యాణ్ అన్నారు.