కామారెడ్డి జిల్లాలో ముగ్గురి సూసైడ్ కేసు మిస్టరీ ఇంకా వీడలేదు. భిక్కనూర్ ఎస్సై సాయి కుమార్, బీబీపేట్ కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ అడ్లూరి పెద్దచెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అసలు వీరి మరణం వెనుక కారణాలేంటి.. అనేది తేలాల్సి ఉంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లా ఎస్పీ సిందు శర్మ కూడా ఈ కేసును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు.
ముగ్గురు ఆత్మహత్య కేసులో ఎలాంటి ఐ విట్‌నెస్ లేవని సింధు శర్మ తెలిపారు. ముందుగా ఒకరు చెరువులో దూకితే కాపాడేందుకు మిగితా ఇద్దరు దిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. నిఖిల్ ప్రాణ హాని ఉన్నట్లు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తనకు తెలియదని అన్నారు. ఆ విషయంలో ఎంక్వైరీ చేస్తున్నామని.. పోస్టుమార్టం ప్రైమరీ రిపోర్ట్ వచ్చిందని చెప్పారు.
అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి ఎలాంటి ప్రత్యక్ష సాక్ష్యులు లేరని సింధు శర్మ చెప్పారు. అవి ఆత్మహత్యలా, ప్రమాదకరంగా జరిగిందా అనే కోణంలో విచారణ చేస్తున్నామన్నారు. మొబైల్ ఫోన్ సంభాషణల ఆధారంగా ఆ ముగ్గురు చెరువు దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తుందని.. ఆత్మహత్యలకు సంబంధించి మొబైల్ ఫోన్లు, నీటి నమూనాలు సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని వివరించారు.