మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన పనికి బ్యాంకు అధికారులు రాత్రిరాత్రే ఉరుకులు పరుగులు పెట్టారు. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం గ్రామంలో ఓ వ్యక్తి ఫుల్లుగా మద్యం సేవించి ఎస్‌బీఐ ఏటీఎం ధ్వంసం చేయడానికి ప్రయత్నించాడు. మద్యం మత్తులో ఎస్‌బీఐ ఏటీఎంలోకి వెళ్లి ఏటీఎం స్క్రీన్‌ను బండరాయితో పగులగొట్టేందుకు ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో సైరన్ మోగడంతో అతను ఆ ప్రయత్నాన్ని విరమించి పారిపోయాడు. అయితే ఏటీఎంను బండరాయితో పగలగొట్టేందుకు ప్రయత్నించే సమయంలో ముంబైలో ఉన్న హెడ్ ఆఫీస్ కు అలర్ట్ వెళ్లింది. వెంటనే అక్కడి అధికారులు అప్రమత్తమై గోపాలపురం బ్రాంచ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
అర్ధరాత్రి దాటిన తర్వాత ఎస్బిఐ అధికారులు గోపాలపురం పోలీసులకు సమాచారం ఇచ్చారు. గోపాలపురం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సీసీటీవీ ఫుటేజిని పరిశీలించి విచారణ చేపట్టారు. గోపాలపురంలోని స్థానికంగా ఉండే వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టాడని నిర్ధారణకు వచ్చి అతనిని వెతికే పనిలో పడ్డాడు. దీనిపై బ్రాంచ్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.