పదో తరగతి పరీక్షలకు రెడీ అవుతున్నారా..? అయితే చెప్పబోయేది మీ కోసమే. రాబోయే రోజుల్లో మీరు టెన్త్ క్లాస్‌కు బోర్డ్ ఎగ్జామ్స్ రాయాల్సిన పనిలేదు. అంతేకాదు.. 12వ తరగతి వరకు అంటే ఇంటర్ వరకు ఎలాంటి బోర్డ్ ఎగ్జామ్స్ కోసం కుస్తీ పట్టాల్సిన పనిలేదు. అదేంటి అంటారా.. అవును మరి.. 34 ఏళ్ల తర్వాత దేశంలో నూతన విద్యావిధానాన్ని తీసుకొచ్చింది కేంద్రం. ఇందులో భాగంగా ముఖ్యమైన మార్పులు చేసింది.
నూతన విద్యా విధానంలో 12వ తరగతి వరకు అంటే సీనియర్ ఇంటర్ వరకు ఎలాంటి బోర్డు ఎగ్జామ్స్ ఉండవు. అంటే ఇప్పటి వరకు విద్యార్థులు పదో తరగతి కోసం పబ్లిక్ పరీక్షలకు హాజరవుతుండగా.. ఇకపై ఆ అవసరం ఉండదు. ఇదే సమయంలో 9వ తరగతి నుంచి 12వ క్లాస్ వరకు సెమిస్టర్ల విధానంలో పరీక్షలు ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఇప్పటివరకు 10+2+3 విధానంలో మన విద్యా వ్యవస్థ ఉండగా.. ఇకపై 5+3+3+4 ఫార్ములా ప్రకారం బోధన చేస్తారు.
మరో ముఖ్యమైన మార్పు డిగ్రీ విషయంలో చోటు చేసుకుంది. డిగ్రీ కాలేజీ విద్య 3, 4 సంవత్సరాలుగా ఉంటుంది. అంటే గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం పాసైతే సర్టిఫికెట్, సెకండ్ ఇయర్‌కు డిప్లోమా, థర్డ్ ఇయర్‌లో డిగ్రీ లభిస్తుంది. ఉన్నత విద్యను అభ్యసించాలని భావించే వారు నాలుగేళ్ల డిగ్రీ చదవాల్సి ఉంటుంది. అది చదివిన స్టూడెంట్స్ ఒక సంవత్సరంలో MA చేయాల్సి ఉంటుంది. అదే సమయంలో MA విద్యార్థులు నేరుగా పీహెచ్‌డీ చేయవచ్చు.
అన్నింటికంటే ముఖ్యమైన మార్పు పాఠశాల విద్యలో చోటు చేసుకుంది. ఐదో తరగతి వరకు విద్యార్థులకు మాతృభాషతోపాటు స్థానిక భాష, ఇంకా జాతీయ భాషలో మాత్రమే బోధిస్తారు. ప్రభుత్వ విద్యా సంస్థలతోపాటు ప్రైవేటు, డీమ్డ్ యూనివర్శిటీలకు ఒకే నిబంధనలు అమలులో ఉంటాయి.