స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరుకుంటోంది. ఈ క్రమంలోనే సహనిందితుడిగా భావిస్తున్న వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని పలుమార్లు విచారించిన సీబీఐ.. నేడు మళ్లీ విచారించనుంది. ఈనెల 16వ తేదీనే విచారణకు హాజరుకావాలని సీబీఐ అధికారులు నోటీసులు ఇవ్వగా.. ముందస్తు షెడ్యూల్‌లో భాగంగా ఇతర కార్యక్రమాలు ఉన్నాయంటూ నాలుగు రోజులు గడువు కోరారు. దీంతో ఆయన విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన అధికారులు ఇవాళ హాజరుకావాలని ఆదేశించారు.
ఈ నేపథ్యంలో సీబీఐ నోటీసులపై సుప్రీంకోర్టును అవిశాన్ రెడ్డి ఆశ్రయించారు. సీబీఐ విచారణ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. అయితే రెండు వారాల తర్వాత ఈ పిటిషన్ పై విచారణ చేపడతామని న్యాయస్థానం తెలిపింది. దీంతో అవినాశ్ కచ్చితంగా సీబీఐ విచారణకు వెళ్లాల్సి ఉంది. దీంతో అవినాశ్ విచారణకు హాజరవుతారా? లేదా? విచారణకు హాజరైతే అరెస్ట్ చేస్తారా? అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.