స్వతంత్ర, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా సునీత తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఈ కేసులో అవినాశ్ ప్రధాన కుట్రదారు అని.. సీబీఐ నాలుగు సార్లు విచారణకు పిలిచినా ఏదో వంకతో హాజరుకావడం లేదని తెలిపారు. కేసు దర్యాప్తును అవినాశ్ ప్రభావితం చేస్తున్నారని.. అందుచేత బెయిల్ రద్దు చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం విచారణను మంగళవారానికి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా మే 31న తెలంగాణ హైకోర్టు అవినాశ్ రెడ్డికి షరతులతో కూడిన ముందస్తు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ బెయిల్ తీర్పును వైఎస్ వివేకా కూతరు సునీతారెడ్డి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.