స్వతంత్ర వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా కొత్తగా మరో 50 మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. వీటిలో తెలుగు రాష్ట్రాల్లో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఫలితంగా తెలంగాణలో 9, ఏపీలో ఐదు కాలేజీల్లో సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో ఏపీకి 5, తెలంగాణకు 12 మెడికల్ కాలేజీలు దక్కనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల, రాజమండ్రి, విజయనగరం జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఏర్పాటు కానున్నాయి. 2023-24 అకడమిక్ నుంచి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో ఈ కాలేజీలు మొదలు పెడతామని కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ నుంచి కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించాలని ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రూ.8500 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో మొత్తం 17 కొత్త మెడికల్ కాలేజీలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు.కొత్త కాలేజీల్లో ఒక్కో కాలేజీకి 150 సీట్ల వంతున 750 సీట్లు అదనంగా రాబోతున్నాయి. రాష్ట్ర విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పనిలేకుండా మన రాష్ట్రంలోనే వైద్య విద్యనభ్యసించే అవకాశం ఈ కాలేజీల ద్వారా లభిస్తుందని సర్కార్ భావిస్తోంది. రానున్న రెండు , మూడేళ్లలో దశలవారీగా మిగిలిన 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది.
తెలంగాణలోని మేడ్చల్, వరంగల్, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, అసిఫాబాద్, నిర్మల్, సిరిసిల్ల, వికారాబాద్, జనగాం, హైదరాబాద్‌లలో కొత్త కళాశాలల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మేడ్చల్-మల్కాజిగిరిలో అరుంధతి ట్రస్ట్, మేడ్చల్‌లో సీఎంఆర్ ట్రస్ట్, వరంగల్‌లో కొలంబో ట్రస్ట్‌ల ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. మిగిలిన అన్ని కాలేజీలను ప్రభుత్వమే ఏర్పాటు చేసేందుకు ఆమోదం లభించింది. ఇక ఈ ఒక్క ఏడాదిలోనే తెలంగాణలో దాదాపు 900 మెడికల్ సీట్లు పెరగనున్నాయి. రాష్ట్ర విభజన నాటికి తెలంగాణలో ఐదు మెడికల్ కాలేజీలు ఉండగా…. ఈ తొమ్మిదేళ్ల కాలంలో వీటి సంఖ్య 26కి పెరిగింది.
ఈ కొత్త మెడికల్ కాలేజీల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలతోపాటు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సిబ్బందిని పెంచడం, వసతులు గణనీయంగా పెంచడం, మెడికల్ కళాశాలలను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం, పరికరాలు పెంచడం.. ఇలా ఎన్నో చర్యలు తీసుకోవడం ద్వారా పీజీ సీట్లను పెంచుకోగలుగుతున్నామని అధికారులు చెబుతున్నారు.