AP Politics |ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు దాదాపు ఏడాది సమయం ఉన్నప్పటికి.. ఇప్పటినుంచే హడావుడి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదంటూ అధికార, ప్రతిపక్షాలు ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకేసి వై నాట్ 175 నినాదాన్నిఅందుకున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ఒక సీటు కూడా రాకుండా తమ పార్టీ క్లీన్ స్వీప్ చేయాలనేది వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. పార్టీ శ్రేణుల్లో ఉత్సహం కోసం అధినేత అలాంటి వ్యాఖ్యలు చేయడం సర్వసాధారణం. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి ఒక్కరూ.. తాము గెలవబోమని తెలిసినా.. ఇండిపెండెంట్ అభ్యర్థితో సహా పోటీ చేసే ప్రతి ఒక్కరూ గెలుపు తనదేనంటూ ధీమా వ్యక్తం చేస్తూ ఉంటారు.
అయితే బ్యాలెట్ బాక్సులు తెరిచిన తర్వాత మాత్రమే ఎవరి సత్తా ఏమిటి.. ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్న నాయకుడెవరో తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ, టీడీపీ, జనసేన బలమైన పార్టీలుగా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దేశంలో బలమైన పార్టీలు అయినప్పటికి.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ప్రస్తుతం అధికారంలోకి వచ్చేంత బలంగా లేవు. మరోవైపు వామపక్ష పార్టీలు ఏదో ఓ బలమైన, గెలిచే పార్టీతో పొత్తు పెట్టుకుని.. నాలుగైదు.. ఎమ్మెల్యే సీట్లు అయినా గెలిచి.. ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మరోవైపు ఏపీలో రోజురోజుకి రాజకీయ సమీకరణాలు మారుతూ వస్తున్నాయి. ఇప్పటివరకు వైసీపీపై ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారనే ప్రచారాన్ని ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు.. ఇతర విపక్ష పార్టీలు చేస్తూ వస్తున్నాయి. ఈ ప్రచారానికి మరింత బలం చేకూర్చాయి ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.
ఎమ్మెల్సీ ఎన్నికలను రాజకీయాలకు ముడిపెట్టలేం. పట్టభద్రులు లేదా ఉపాధ్యాయ శాసనమండలి స్థానాల నుంచి ఓ మంచి వ్యక్తిని ఆయా వర్గాల సమస్యలను చట్టసభల దృష్టికి తీసుకెళ్లడం కోసం ఎన్నుకుంటూ ఉంటారు. అయితే రాజకీయాలకు అతీతంగా జరిగే ఎన్నికలు.. ఇటీవల కాలంలో రాజకీయ రంగు పులుముకున్నాయి. ఏది ఏమైనప్పటికి ఇటీవల జరిగిన ఉత్తరాంధ్ర, పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసనమండలి స్థానాల్లో మూడు ఎమ్మెల్సీలను తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది.
AP Politics |ఈ గెలుపును శాసనసభ ఎన్నికలతో ముడిపెట్టలేము.. కాని ఈ ఎన్నికల్లో ఓటు వేసిన వారంతా శాసనసభకు జరగబోయే ఎన్నికల్లో ఓటు వేసే వారే.. అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థికి ఓటు వేశారంటే.. తప్పనిసరిగా వారు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారనే విషయం స్పష్టమవుతుంది. ఇదే సందర్భంగా ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి స్థానంలో బలమైన పిడిఎఫ్ బలపర్చిన అభ్యర్థిని కాదని టీడీపీ అభ్యర్థికి పట్టభద్రులు పట్టం కట్టారంటే యువత, చదువుకున్న వారు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఈ ఎన్నికల్లో చూపించారనే అర్థం చేసుకోవల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
వైసీపీ మాత్రం రాష్ట్రంలోని పేద, మధ్య తరగతి వర్గాల్లోని ప్రతి కుటుంబం ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా లబ్ధిపొందుతోందని, తప్పనిసరిగా తమ సంక్షేమ పథకాలు తమను గెలిపిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాని.. ప్రజల డబ్బులో లేదా అప్పులు చేయడం ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, ఏ నాయకుడు తమ జేబులో డబ్బులు పెట్టడం లేదనే విషయం ప్రజల్లోకి వెళ్లిపోయింది. దీంతో సంక్షేమ పథకాలు అనేవి ఎన్నికల్లో వైసీపీ ఆశించింనంత ప్రభావం చూపిస్తాయా లేదా అనేది ఎన్నికల ఫలితాలే తెలియజేయాలి. సంక్షేమ పథకాలు పక్కనపెడితే మిగిలిన విషయాల్లో ప్రభుత్వం ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటోందనేది ప్రతిపక్షాల ఆరోపణ. పన్నుల పెంపు, పాడైన రహదారుల మరమ్మతులు సకాలంలో చేయకపోవడంతో పాటు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు మినహా మిగిలిన ఉద్యోగాల భర్తీ లేకపోవడం వంటి సమస్యలు అధికారపక్షాన్ని ఇబ్బంది పెట్టే అంశాలుగా చూడాల్సి ఉంటుందనేది పొలిటికల్ అనలిస్ట్‌ల అభిప్రాయం.
ఇలా రోజురోజుకు మారుతున్న రాజకీయ సమీకరణాలు ఎవరికి లాభం చేస్తాయి.. ఎవరికి నష్టం చేస్తాయనే విషయం వచ్చినప్పుడు.. సంక్షేమ పథకాలు, ప్రజా వ్యతిరేకత పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్‌లో కుల సమీకరణాలు, పార్టీల మధ్య పొత్తులే గెలుపును డిసైడ్ చేస్తాయని.. మిగిలిన అంశాలన్ని నామ మాత్రపు ప్రభావాన్నే చూపిస్తాయని కొంతమంది చెబుతున్న మాట.. వైసీపీ, తెలుగుదేశం పార్టీలకు క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఉండగా.. వైసీపీతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ నిర్మాణ పరంగా బలంగా ఉందనే చెప్పుకోవాల్సి ఉంటుంది.
ఇదే సమయంలో సినీ గ్లామర్‌తో పాటు.. కుల సమీకరణాలు.. యువత జనసేనకు జై కోడుతున్న నేపథ్యంలో జనసేన ఒంటరిగా అధికారంలోకి వస్తుందని చెప్పలేనప్పటికి తప్పనిసరిగా వచ్చే ఎన్నికల్లో కీ రోల్ పోషిస్తుందనేది సుస్పష్టం. ఇప్పటికే ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ప్రభుత్వ వ్యతిరేకత ఓటును చీలనీయబోమనే ప్రకటన చేశారు. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓటు ప్రతిపక్ష పార్టీల మధ్య చీలడం వల్ల అధికారపక్షానికి లాభం చేకూరుస్తుందని.. అలా కాకుండా ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్ని జట్టు కడతాయనే సంకేతాన్ని పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ తీసుకోబోయే నిర్ణయమే ఏపీ రాజకీయాల్లో కీలకం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో జతకట్టడంతో ఒక ఎత్తైతే.. ముఖ్యమంత్రి పదవి విషయంలో జనసేనకు రెండున్నరేళ్లు లేదా రెండేళ్లు.. టీడీపీకి మూడేళ్లు లేదా రెండేళ్లనే ప్రకటన ఎన్నికలకు ముందే వెలువడితే ఫలితం ఓ రకంగా ఉంటుందని, జనసేనానికి ముఖ్యమంత్రి పదవి విషయంలో క్లారిటీ ఇవ్వకపోతే ఫలితం మరోలా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వేళ టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయడంతో పాటు.. సీఎం సీటు విషయంలో షేరింగ్‌కు ఒప్పందం జరిగితే మాత్రం వైసీపీకి కొంతమేర నష్టం జరగుతుందనే చర్చ నడుస్తోంది. మరి ఈ మారుతున్న రాజకీయ సమీకరణాలు అధికార పక్షానికి కలిసొస్తుందా.. ప్రతిపక్షాలకు కలిసొస్తుందా అనేది తేలాలంటే మరికొన్ని నెలలు వేచి చూడాల్సిందే.