Nara Lokesh |ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్- ఏపీపీఎస్సీ(APPSC) నిర్వహిస్తున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష గడువును మరో మూడు నెలల పాటు పొడిగించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కోరారు. అభ్యర్థుల ఆందోళనను అర్థం చేసుకోవాలని పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డికి ఆయన లేఖ రాశారు. అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి అయ్యాక మరిచిపోయారంటూ లేఖలో లోకేష్ పేర్కొన్నారు.
ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీకాక, మరో వైపు ప్రైవేటు ఉద్యోగాల లభించక యువత ఎంతో నిరాశతో ఉన్నారన్నారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్ల తర్వాత విడుదల చేసిన గ్రూప్-1 నోటిఫికేషన్‌కు సంబంధించి ప్రిలిమ్స్ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ సన్నద్ధతకు 90 రోజుల కంటే తక్కువ గడువు ఉందని, పరీక్షకు సిద్ధం కావడానికి 7 పేపర్లు పూర్తి చేయాల్సి ఉండటంతో అభ్యర్థులు ఒత్తిడికి గురవుతున్నారని లోకేష్(Nara Lokesh) ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గడువుని అదనంగా మరో 90 రోజుల పెంచాలని కోరారు. ఇదే విషయంపై ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్‌కు లోకేశ్ మరో లేఖ రాశారు.
Read Also: పేపర్ లీకేజీ ఘటనపై తాజా నివేదిక ఇవ్వాలి: గవర్నర్ తమిళిసై
Follow us on: Youtube Instagram