మనిషి ముసుగేసుకున్న మృగాలు సమాజంలో తిరుగుతున్నాయి. ఇలాంటి వారి వల్ల ఆడవాళ్ల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టాలన్నా.. పిల్లలను బయటకు పంపించాలన్నా వందసార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. అంత దారుణంగా జరుగుతున్నాయి సమాజంలో నేరాలు, ఘోరాలు.
మెదక్ జిల్లాలో ఇలాంటి దారుణమే జరిగింది. ప్రియురాలు దూరం పెట్టిందని ఆమె ప్రియుడు కక్ష పెంచుకున్నాడు. అదను చూసి ఆమెపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇంత దారుణానికి ఒడిగట్టిన నిందితుడు.. ఏమీ తెలియనట్టు మామూలుగా మనుషుల మధ్య తిరుగుతున్నాడు.
ఈ నెల 6 నుంచి రేణుక కనిపించకపోవడంతో ఆమె కొడుకు శ్రీనాథ్ మెదక్ టౌన్ పొలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఆమె కోసం వెతుకులాట మొదలుపెట్టారు. ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తుల గురించి ఆరా తీయడం ప్రారంభించారు. మహిళ కాల్ డేటాలో ప్రియుడి నంబర్ ఉండటంతో పోలీసులు ఆ దిశగా విచారించారు. దీంతో అసలు విషయం బయటపడింది.
భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో కలిసి మెదక్ పట్టణంలోని ఫతే నగర్‌లో ఉంటుంది రేణుక(45). ఈ క్రమంలో ఇంటి పక్కనే ఉంటున్న యేసు(40)తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఆమె కుమారులకు తెలిసింది. దీంతో ఆమెను మందలించడంతో ప్రియుడిని దూరం పెట్టింది.
రేణుక దూరం పెట్టడంతో ఆమెపై కక్ష పెంచుకుని హత్య చేయాలని ప్లాన్ వేసుకున్నాడు యేసు. ఈ క్రమంలో మద్యం తాగుదామని రేణుకని పిలిపించుకున్నాడు. చిన్నశంకరంపేట (మం) కొండాపూర్ అటవీప్రాంతంలో రేణుకని తీసుకెళ్లి మద్యం తాగించాడు.
మద్యం మత్తులో ఉండగా వెంట తెచ్చుకున్న కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం శవాన్ని గుర్తుపట్టకుండా పెట్రోల్ పోసి తగలబట్టాడు యేసు. పోలీసులు తమ స్టైల్లో విచారించడంతో నిందితుడు పూసగుచ్చినట్టు తాను చేసిన నేరాన్ని అంగీకరించాడు. నిందితున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.