ఆహా ఓటీటీలో గత సంవత్సరం వచ్చిన ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్ మంచి విజయం సాధించింది. దానికి సీక్వెల్‌గా ఇప్పుడు సీజన్ 2 రాబోతోంది. అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ బ్యానర్లో ‘అర్థమైందా అరుణ్ కుమార్’ సీజన్ 2 ఆహా ఓటీటీలో అక్టోబర్ 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి టీజర్ రిలీజ్ చేయగా తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. మొదటి సీజన్ కంటిన్యూగా సాగింది. అరుణ్ కుమార్ హైదరాబాద్ వచ్చి ఓ ప్రైవేట్ కంపెనీలో జాయిన్ అయి పడ్డ కష్టాల తర్వాత మేనేజర్‌గా ఎదిగాక ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు? మళ్ళీ తన లైఫ్‌లోకి ముగ్గురు అమ్మాయిలు ఎలా వచ్చారు? వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అని కామెడీతో ఎమోషనల్‌గా తెరకెక్కించినట్టు తెలుస్తోంది. రెండో సీజన్లో అరుణ్ కుమార్ పాత్రలో సిద్ధూ పవన్ నటించగా తేజస్వి మడివాడ, అనన్య, సిరి రాశి ముఖ్య పాత్రల్లో నటించారు.


