బీహార్‌లో మరో వంతెన కూలిపోయింది. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టుగా చెప్పుకునే గంగా నదిపై నిర్మిస్తున్న తీగల బ్రిడ్జిలోని ఒకవైపు భాగం కూలి నదిలో కొట్టుకుపోయింది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. గత తొమ్మిదేళ్లుగా నిర్మాణంలోనే ఉన్న ఈ వంతెన కూలడం ఇప్పటికి ఇది మూడోసారి. నిర్మాణంలో ఉండగానే ఈ వంతెన పదేపదే కూలిపోతుండటంతో నిర్మాణ నాణ్యత, ప్రాజెక్టుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
సీఎం కలల ప్రాజెక్టు అయిన ఈ తీగల వంతెన వరుసగా కూలిపోతుండటంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 2014లో ప్రారంభమైన దీని నిర్మాణం ఇప్పటికీ పూర్తికాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందో తెలయడం లేదంటూ ప్రజలు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఇంతకీ ఈ వంతెన తమకు అందుబాటులోకి వస్తుందా..? అంటూ ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వంతెన కూలిన ఘటనపై ప్రాజెక్టు బాధ్యత వహించే నిర్మాణ సంస్థ ఎస్‌కే సింగ్లా కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎలాంటి వివరణా ఇవ్వలేదు.