26.2 C
Hyderabad
Saturday, April 20, 2024
spot_img

అరుదైన రాజకీయ రణరంగ క్షేత్రం ‘మైలవరం’

      చుట్టూ పచ్చని కొండలు…అందమైన ప్రకృతి.. ఈ రెండింటి మధ్య ఎంతో ప్రశాంతంగా ఉన్నట్లుగా కన్పిస్తుంది మైల వరం నియోజకవర్గం. కానీ, రాజకీయంగా మాత్రం ఎప్పుడూ అగ్నిపర్వతం మాదిరిగా భగభగమంటుంటాయి ఇక్కడి పరిస్థితులు. చూడచక్కని కొండపల్లి బొమ్మలకు కేరాఫ్‌గా ఉన్న మైలవరం లో అక్రమ మైనింగ్ వ్యవహారం చాలా గట్టిగా నే సాగుతుంటుంది అన్న ఆరోపణలున్నాయి. ఈ విషయం లో అధికార పార్టీ, ప్రతిపక్షం అన్న తేడా ఏమీ లేదన్న విమ ర్శలు విన్పిస్తున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో హేమాహేమీల్లాంటి నేతలు పోటీ చేసిన.. ఎంతో కీలకమైంది మైలవరం నియోజకవర్గం.

       మైలవరం రాజకీయాలు ఎప్పుడూ హాట్‌హాట్‌గా సాగుతుంటాయి. అంతర్జాతీయంగా ఎంతో పేరు ప్రసిద్ధి చెందిన కొండపల్లి బొమ్మలు తయారయ్యే ప్రాంతమే మైలవరం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. గతంలో కృష్ణా జిల్లాలో ఉన్న మైలవరం.. జిల్లాల విభజన తర్వాత ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలోనే అతి పెద్ద అసెంబ్లీ స్థానంగా ఉంది. రాష్ట్రంలో ఎక్కువ మంది ఓటర్లు ఉన్న నియోజక .వర్గాల్లో మైలవరం కూడా ఒకటని చెప్పాలి. ఈ నియోజకవర్గం చరిత్ర ఓసారి గమనిస్తే… 1952లో ఇది ఏర్పాటైంది. అప్పటి నుంచి 14 సార్లు ఎన్నికలు జరిగగా…6 సార్లు కాంగ్రెస్, 4 సార్లు టీడీపీ, 2 సార్లు కమ్యూనిస్టులు, ఒకసారి ఇండిపెండెంట్, ఒకసారి వైసీపీ విజయం సాధించాయి. నాటి తరంలో ప్రముఖ నేతగా ఉన్న చనుమోలు వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఐదుసార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు ఒకసారి, దేవినేని ఉమా మహేశ్వరరావు రెండు సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందారు. ప్రస్తుతం వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా వసంత కృష్ణప్రసాద్ ఉన్నారు. అయితే.. పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందికర పరిస్థితులతో ఆయన… వైసీపీ నుంచి పోటీ చేయనని చెప్పి బయటకు వచ్చేశారు. గత కొద్ది రోజులుగా ఈ అంశంపైనే జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

     మైలవరం నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 70 వేల మంది ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్ల సంఖ్య లక్షా 16 వేల 819 మంది కాగా, మహిళల సంఖ్య లక్షా 17 వేల 198 మంది. ఇక, మైలవరం నియోజకవర్గంలో ఇబ్రహీం పట్నం, జి.కొండూరు, మైలవరం, రెడ్డిగూడెం నాలుగు మండలాలున్నాయి. వీటితో పాటు విజయవాడ రూరల్ గ్రామాలు కొన్ని ఇందులోనే ఉన్నాయి. ఇక, నైసర్గిక స్వరూపం ప్రకారం చూస్తే…మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం మద్దులపర్వ గ్రామం నుంచి ప్రారంభ మవుతుంది. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వరకు విస్తరించి ఉంది. అంతేకాదు..రెండు జాతీయ రహదారులున్న పట్టణంగా మైలవరం పేరు పొందింది. ఇక, స్థానికంగా ఉన్న జక్కంపూడి కాలనీ అతిపెద్దదనే చెప్పాలి. విజయవాడకు అతి దగ్గరగా ఉన్న స్థానం మైలవరం.ఇబ్రహీంపట్నానికి దక్షిణాన కృష్ణానది ఉంది. ఎంతో మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని నిత్యం సందర్శిస్తూ ఉంటారు. టీడీపీ హయాంలో పవిత్ర సంగమం పేరుతో పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇదే కాకుండా నియోజకవర్గంలో శ్రీ కోట మహాలక్ష్మమ్మ అమ్మవారి ఆలయం, శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ కంచి కామాక్షి సమేత శ్రీ ఏకాంబరేశ్వరస్వామివారి ఆలయం, శ్రీ కార్యసిద్ధి దాసాంజనేయస్వామి సహా పలు ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.

     చుట్టూ పరవళ్లు తొక్కుతూ ప్రవహించే కృష్ణానది మైలవరం చెంతనే ఉంది. అందుకే ఇక్కడికి ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు. దీంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని తెలుగు దేశం హయాంలో గట్టి ప్రయత్నాలే జరిగాయి. పవిత్ర సంగమం అనే నామకరణం కూడా చేశారు. అయితే… అమరావతి రాజధాని కావడం ఆ తర్వాత నెలకొన్నరాజకీయ పరిణామాల్లో ప్రభుత్వాలు మారటంతో… కేపిటల్‌తోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ది విషయంలో పరిస్థితులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.రాజకీయంగానే కాదు… మైలవరం నియోజకవర్గానికి మరెన్నో ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఇక్కడే నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. 1977లో విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్‌కు శంకుస్థాపన చేసేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇబ్రహీం పట్నం వచ్చారు.

   ఆ తర్వాత రెండేళ్లకు అంటే 1979లో మొదటి యూనిట్ ప్రారంభమైంది. ఇప్పుడు ఎనిమిదో యూనిట్ నిర్మాణంలో ఉంది. బొగ్గు ఆధారిత పవర్ స్టేషన్ లో సుమారు 1500 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరుగుతుంది. ఇక ఎనిమిదో యూనిట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మరో 500 మెగావాట్ల పవర్ ఉత్పత్తి అవుతుంది. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ బోర్డు మాజీ ఛైర్మన్ నార్ల తాతారావు పేరుపెట్టారు. ఇబ్రహీంపట్నం-కొండపల్లి గ్రామాల మధ్య విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. అత్యధిక ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను సాధించడం ద్వారా దేశంలోనే మొదటి స్థానంలో ఈ థర్మల్ పవర్ స్టేషన్ పలుసార్లు నిలిచింది. వివిధ సంస్థల నుంచి అనేక ప్రతిష్టాత్మక అవార్డులు అందుకుంది. వరుసగా 21 సంవత్సరాల పాటు మెరిటోరియస్ ప్రొడక్టివిటీ అవార్డులను అందుకోవడమే కాదు, వరుసగా 12ఏళ్ల పాటు ప్రోత్సాహక అవార్డులను అందుకుంది. దేశంలోనే ప్రతిష్టాత్మక థర్మల్ పవర్ స్టేషన్‌గా పేరు సొంతం చేసుకుంది.

      ప్రపంచ పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన కొండపల్లి కోట కూడా మైలవరం నియోజకవర్గంలోనే ఉంది. 14వ శతాబ్దంలో దీన్ని బ్రిటిష్ రాజులు నిర్మించినట్టు శిలా ఫలకాలున్నాయి. విజయవాడకి ఇది కేవలం 16 కిలో మీటర్ల దూరంలో మాత్రమే ఉండటంతో ఎంతో మంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శిస్తూ ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ కోట అభివృద్ధికి నిధులు కేటాయించింది. దీని కేంద్రం గా ప్రభుత్వం ఉత్సవాలు కూడా నిర్వహించింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కొండపల్లి కొయ్య బొమ్మలు ఇక్కడే దొరుకుతాయి. కొండపల్లి కోట చుట్టూ ఉన్న అడవుల్లో దొరికే కలపతో వీటిని చేస్తారు. అయితే ప్రత్యేకంగా చేసిన కొన్ని పనిముట్లను ఉపయోగించి వీటిని తయారు చేయడం ఇక్కడి వాళ్ల ప్రత్యేకత. ఈ బొమ్మల తయారీకి పొనికి అనే చెక్కను ప్రధానంగా ఉపయోగిస్తారు. అందువల్లే ఈ కొండ పల్లి బొమ్మలకు అంత పేరు వచ్చింది. ఇక, రవాణా విషయానికి వస్తే… కొండపల్లి కేంద్రంగా రైల్వే జంక్షన్‌ కూడా ఉండటం విశేషం.

    మైలవరం నియోజకవర్గంలో ఎంత మంది ప్రజా ప్రతినిధులు వచ్చినా, ఏ రోడ్డు చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టే ఉంటుందన్న విమర్శలున్నాయి. దశాబ్దాల తరబడి మైలవరం నియోజకవర్గాన్ని ప్రధానంగా డ్రైనేజీ సమస్య పట్టి పీడిస్తోందని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు. మురుగునీరు పోయేందుకు సరైన సదుపాయం లేకపోవడంతో అదంతా బహిరంగంగానే ప్రవహిస్తూ ఉంటుంది. దీంతో.. చేసేది లేక ఆ మురుగు నీటినంతా నేరుగా స్వచ్ఛమైన జలవనరుల్లోకి వదులుతున్నారు. అయితే.. ఎన్నికలు వచ్చాయంటే చాలు నేతలు.. అరచేతిలో వైకుంఠం చూపిస్తారని, తీరా ఓట్లు వేసిన తర్వాత అందరిలాగే ముఖం చాటేస్తారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మురుగు నీటి కారణంగా దోమలు విజృంభించి మలేరియా, డెంగ్యూ లాంటి రోగాలు వ్యాపిస్తున్నాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలు, చిన్నారులు పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. అదే సమయంలో చెంతనే కృష్ణానది ఉన్నా తాగునీటి కోసం ఇక్కట్లు తప్పడం లేదు. చేతిపంపులు, బోరు బావులు, కాలువలు, చెరువులు వంటి సౌకర్యాలేమీ లేవు. అలాగే… నియోజకవర్గంలో సరైన విద్య, వైద్య సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న విమర్శలున్నాయి.

      విజయవాడకు ఓ మోస్తరు దూరంలోనే ఉంటుంది మైలవరం. దీంతో.. ఇక్కడి ప్రజలకు ఏ అవసరం వచ్చినా బెజవాడకే వెళ్తుంటారు. ఓ పెళ్లి, పేరంటం, ప్రధాన నగరాలకు వెళ్లాలన్నా అన్నీ విజయవాడ నుంచే. ఇక, ఉద్యోగ, వ్యాపారాల కోసం రోజూ విజయవాడకు వెళ్లి వచ్చే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే… ఇందుకు ప్రధాన కారణం.. అన్ని రంగాల్లో మైలవరం అభివృద్ధి చెందకపోవడ మేనని చెప్పాలి. అయితే.. ఇటీవలె వైసీపీ నుంచి బయటకు వచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అక్రమ మైనింగ్‌ వ్యవహారంలో…. సొంతపార్టీపైనే సంచలన ఆరోపణలు చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మైలవరం నియోజకవర్గం అంశం చర్చనీయాంశమైంది. అయితే.. అక్రమ మైనింగ్‌ వ్యవ హారంలో వైసీపీ నేతలే కాదు, ఇతర పార్టీల వాళ్లూ ఉన్నారని ఆరోపించి కలకలం రేపారు ఎమ్మెల్యే వసంత. డబ్బుల దగ్గరకు వచ్చేసరికి ఆ పార్టీ, ఈపార్టీ అని తేడా లేకుండా అంతా ఏకమయ్యారని ఆరోపించారాయన. ఈ విషయంలో ఎంత హెచ్చరించినా ఎవరూ మాట వినడం లేదని, దోపిడీ అంతా యథేచ్చగా సాగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే వసంత.

వైసీపీ, టీడీపీ ఇలా ఏ పార్టీ తీసుకున్నా.. సొంత పార్టీలోనే విబేధాలున్న నియోజకవర్గం కూడా మైలవరం అనే వాదన బలంగా విన్పిస్తోంది. అధికార వైసీపీ అయినా.. ప్రతిపక్ష టీడీపీ అయినా గ్రూపులుగా ఇక్కడ విడిపోతారు. వీరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుతుంటాయి. ఈ గొడవలన్నీ మైనింగ్ దగ్గరే మొదల వుతాయన్న విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. ఎవరికి వారు మరొకరికి తెలియకుండా దోచు కోవాలన్న యావ తప్ప మరోటి లేదనే ఆరోపణలు ఇక్కడ సర్వసాధారణంగా విన్పిస్తున్నాయి. ఇక, హేమాహేమీ ల్లాంటి నేతలు ప్రాతినిథ్యం వహించిన ఈ నియోజకవర్గంలో రకరకాల సెంటిమెంట్లు సైతం ప్రచారంలో ఉన్నాయి. ఇక్కడ గెలిచి మంత్రిగా పనిచేసిన వారు.. తర్వాత ఎన్నికల్లో ఓడిపోతారని అంటారు. ఇలా.. ఒకటీ రెండూ కాదు.. ఎన్నో సమస్యలు, మరెన్నో సవాళ్లు ఎదురయ్యే మైలవరంలో నెగ్గుకురావడం అంత ఈజీ కాదని చెబుతారు ఇక్కడి వాళ్లు.

Latest Articles

ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి నగేష్ పై కోడ్ ఉల్లంఘన కేసులు

 ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ పై ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీసులు ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసులను నమోదు చేశారు. పట్టణంలో ఏర్పాటు చేసిన శ్రీరామ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్