స్వతంత్ర, వెబ్ డెస్క్: తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. కొండపై నుంచి తిరుపతికి వెళ్తున్న టెంపో వాహనం మొదటి ఘట్ రోడ్డులో బోల్తాపడింది. కర్ణాటకలోని కోలార్‌కు చెందిన భక్తులు శ్రీవారిని దర్శించుకుని తిరుపతి బయలుదేరారు. మొదటి ఘాట్ రోడ్డులో ఆరో మలుపు వద్దకు రాగానే వాహనం రోడ్డు పక్కన ఉన్న గోడను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13మంది భక్తులు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన భక్తులను రుయా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదేశించడంతో వారిని రుయా నుంచి బర్డ్ హస్పిటల్‌కు తరలించారు. మరోవైపు ఇటీవల ఘాట్ రోడ్డులో వరుసగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకోవడంపై నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.