స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి తెలంగాణ ప్రభుత్వంపై సంచలన అవినీతి ఆరోపణలు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు(ORR) లీజ్‌లో రూ.1000 కోట్ల భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ స్కామ్‌లో మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ కీలకపాత్ర పోషించారని తెలిపారు. ఇంత పెద్ద స్కాంపై దర్యాప్తు సంస్థలను ఆధారాలతో సహా ఫిర్యాదుచేస్తామని రేవంత్ హెచ్చరించారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రతి సంవత్సం కేవలం టోల్ రూపంలోనే రూ.700-800 కోట్లు వస్తాయని.. కానీ 30 సంవత్సరాలకు గానూ ముంబైకి చెందిన ఐఆర్‌బీ ఇన్ ఫ్రా సంస్థకు రూ.7,380కోట్లకే ప్రభుత్వం లీజుకు ఇచ్చిందన్నారు. ఇందులో దాదాపు రూ.1000కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇంత భారీ కుంభకోణంపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో కీలకపాత్ర వహించిన సోమేశ్ కుమార్, అరవింద్ ఇద్దరిని వదిలే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు.