ఈ ఐపీఎల్ సీజన్ లో టీమిండియా సీనియర్ ఆటగాడు అజింక్యా రహానే(34) పేరు మార్మోగిపోతోంది. టెస్టు ఆటగాడిగా ముద్రపడిన రహానే ఆట చూసి అందరూ ఫిదా అయిపోతున్నారు. గత కొన్నేళ్లుగా ఫామ్ లేమితో టీమిండియా జట్టుకు దూరమైన రహానే.. గతేడాది ఐపీఎల్ లో కేకేఆర్ జట్టు తరపున ఆడాడు. అయితే రహానే రాణించకపోవడంతో జట్టు యాజమాన్యం అతడిని వదులుకుంది. దీంతో మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కేవలం రూ.50లక్షలకే రహానేను సొంతం చేసుకుంది.
తొలి రెండు మ్యాచులకు దూరంగా పెట్టిన కెప్టెన్ ధోని.. మూడో మ్యాచులో రహానేకు అవకాశం ఇచ్చాడు. అంతే వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకుంటూ 61 పరుగులతో రెచ్చిపోయాడు. తర్వాతి మ్యాచుల్లోనూ 31, 37 పరుగులు చేశాడు. ఇక ఆదివారం కేకేఆర్ జట్టుతో జరిగిన మ్యాచులో అయితే విధ్యంసం సృష్టించాడు. కేవలం 29 బంతుల్లో 71 పరుగులు చేశాడు.
ఏ జట్టు అయితే తనను అవమానించి వదులుకుందో అదే జట్టుపై ఇలా ప్రతీకారం తీర్చుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 5 మ్యాచ్ లు ఆడిన రహానే.. 199 స్ట్రైక్ రేటుతో 209 పరుగులు చేశాడు. టీ20లకు పనికిరాడన్న వారి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు.