దూరపు బంధువని ఆదరిస్తే తిన్నింటి వాసాలు లెక్కపెట్టాడు. ఐదు కిలోల బంగారం కొట్టేయాలని ప్లాన్ చేశాడు. మరో నలుగురితో కలిసి పెద్ద స్కెచ్ వేశాడు. అక్షరాల రూ.4 కోట్లు మింగేయాలని ప్రణాళిక రచించాడు. దొంగ ఎంత తెలివిగా ప్లాన్ చేసినా.. ఎక్కడో ఓ క్లూ వదులుతాడు. దీన్నే పోలీసులు పట్టుకుంటారు. చివరికి కటకటాలు పాలవ్వడం ఖాయం. ఈ ఘటనలోనూ అదే జరిగింది.
గుంటూరు జిల్లా మంగళగిరిలో సంచలనం సృష్టించిన ఐదు కిలోల బంగారం దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశారు.
అసలేం జరిగింది?
మంగళగిరికి చెందిన దివి రాము అనే వ్యక్తి విజయవాడ గోల్డ్ షాపు నడుపుతున్నాడు. అతని వద్ద దూరపు బంధువు నాగరాజు మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఈ నెల 15న రాత్రి స్కూటీపై ఇంటికి వెళ్తుండగా , ఆత్మకూరు అండర్ పాస్ జంక్షన్ వద్ద రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు యువకులు తన బ్యాగ్ లాక్కొని పారిపోయారని నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థానిక దుకాణదారులను ప్రశ్నించగా.. అలాంటిదేమీ జరగలేదని చెప్పారు.
చోరీ జరిగిన ప్రాంతం అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఇటువంటి ప్రాంతంలో దొంగతనం జరగడంపై అనుమానాలు వ్యక్తం చేశారు పోలీసులు. విజయవాడ నుంచి ఆత్మకూరు వరకు దొంగతనం జరిగిన తీరును పోలీసులు రిక్రియేట్ చేశారు. విజయవాడ బంగారు షాపు నుంచి బాధితుడు నాగరాజు ఆభరణాలు తీసుకెళ్తుండగా ముగ్గురు వ్యక్తులు అతన్ని వెంబడించిన ఆధారాలను సేకరించారు,. పల్సర్ బైక్ పై నాగరాజును అనుసరిస్తున్న దృశ్యాలను విజయవాడ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి కలెక్ట్ చేశారు.
నాగరాజు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించగా.. అదే రోజు రాత్రి 8.30 నుంచి 9.15 గంటల వరకు ఇతరులతో ఫోన్‌లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. అతను ఎవరెవరితో మాట్లాడాడో ఆరా తీశారు. వివరాలను సేకరించారు.
పోలీసుల దర్యాప్తు ఇలా..
జ్యుయెల్లరీ షాపులో మేనేజర్‌గా పనిచేస్తున్న నాగరాజే ఈ దొంగతనం కసులో సూత్రధారి అని పోలీసులు తేల్చారు. బంగారం బ్యాగ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కొట్టేశారని అందరినీ బురిడీ కొట్టించే ప్రయత్నం చేశాడు. అనుమానం రాకుండా రూ.4 కోట్ల విలువైన బంగారాన్ని దొంగతనం చేశారని మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఏఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో మూడు బృందాలు ఈ చోరీ కేసును దర్యాప్తు చేశాయి. ఈ కేసులో నాగరాజుకి స్నేహితులు సాయి, భరత్, లోకేశ్, నవీన్ సహకారం అందించారని విచారణలో వెల్లడైంది. ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితుల నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును పోలీసులు 7 రోజుల్లోనే ఛేదించడం విశేషం.