బంగ్లాదేశ్ తో సిరీస్ పోయినా, అభిమానులకు కనులపండువ చేశారు మన క్రికెటర్లు. రోహిత్ శర్మ స్థానంలో కొత్తగా జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ దుమ్ము దుమారం రేపాడు. అదేదో లోకల్ మ్యాచ్ అడినట్టుగా, పిల్ల క్రికెటర్లతో ఆడినంత సులువుగా డబల్ సెంచరీ చేశాడు. వంద పరుగులు పూర్తయిన తర్వాత రెండో వంద కోసం అతను తీసుకున్న బాల్స్ కేవలం 41 మాత్రమే. ఇది చూస్తే అతని ఆట తీరు ఎంత విధ్వంసంగా సాగిందో తెలుస్తుంది.
మరో ఎండ్ లో విరాట్ కొహ్లీ కూడా ఇషాంత్ కి మద్దతుగా సెంచరీ చేశాడు. 86 బంతుల్లో 104 పరుగులు చేశాడు. వన్డేల్లో ఇది తన 44వ సెంచరీ కాగా, మొత్తమ్మీద అతనికిది 72వ సెంచరీ కావడం విశేషం. అయితే సచిన్ తరహాలో వంద సెంచరీలు పూర్తి చేయగల ఏకైక మొనగాడు ఇండియన్ క్రికెట్ లో కొహ్లీ ఒక్కడే ఉన్నాడని అంతా అనుకుంటున్నారు. అయితే మళ్లీ మునుపటి ఫామ్ లోకి వచ్చినతను వంద సెంచరీలు సులువుగా సాధిస్తాడని అంతా భావిస్తున్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే, 50 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 409 స్కోర్ చేశారు.
ఇక ఇషాంత్ కిషన్ ధాటికి బంగ్లా విలవిల్లాడింది. కేవలం 126 బంతుల్లో 23 ఫోర్లు, 9 సిక్స్ ల సాయంతో డబుల్ సెంచరీ చేశాడు. ఈ మార్క్ తో వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన 7వ క్రికెటర్ గా నిలిచాడు. వన్డేలో ద్విశతకం చేసిన 4వ భారత్ క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు.
అంతర్జాతీయంగా చూస్తే వన్డేల్లో కేవలం 9 డబుల్ సెంచరీలు మాత్రమే ఉన్నాయి. అందులో ఇండియన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఒక్కడే మూడు (264, 209, 208) డబుల్ సెంచరీలు చేస్తే, వీరేంద్ర సెహ్వాగ్ 1 (219), సచిన్ టెండుల్కర్ 1 (200) చేశారు. అంతర్జాతీయంగా చూస్తే న్యూజిలాండ్ కి చెందిన మార్టిన్ గప్తిల్ (237),విండీస్ నుంచి క్రిస్ గేల్ (215), పాకిస్తాన్ నుంచి ఫఖర్ జమాన్ (210) ఉన్నారు.
మొత్తానికి అభిమానులకు పండుగ చేసినా, ఓడిపోయిన తర్వాత ఆడటం కాదు, ఏదైనా గెలిచి చూపించాలని కొందరు అభిమానులు బాధపడుతూనే మెచ్చుకోవడం విశేషం.